రూ.100 కోట్లు కేటాయింపు
ఎనిమిది వేల ఎకరాలకు నీరందించేందుకు చర్యలు
నీటి వృథాను అరికట్టడమే సర్కారు ధ్యేయం
చివరి దశకు చేరుకున్న నిర్మాణాలు
ఆదిలాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు నిర్మించిన సర్కారు.. వర్షపు నీరు వృథా పోకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 50 చెక్‌డ్యాంలను మంజూరు చేసింది. ఒక్కో చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.2 కోట్ల చొప్పున రూ.100 కోట్లు కేటాయించింది. వీటి నిర్మాణాలు గతేడాది ప్రారంభం కాగా.. ఇప్పటికే 40 పూర్తయ్యాయి. మిగిలిన పది చివరి దశలో ఉన్నాయి. ఈ చెక్‌డ్యాం నిర్మాణాలతో దాదాపు 8 వేల ఎకరాలకు సాగు నీరందనుంది. ఇప్పటి వరకు ఒక్క పంట పండిన భూముల్లో రెండు పంటలు వేసుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీటి వనరులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు సాగునీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రాజెక్టులు, చెరువుల నిర్మాణాతో పాటు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల మరమ్మతులు చేపట్టింది. దీంతో రైతుల పంటలకు పుష్కలంగా నీరు అందుతుంది. జిల్లాలో పుష్కలంగా నీటిని నిల్వచేసే అవకాశాలున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో వర్షకాలం ముగిసిందంటే చాలు భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వచ్చేది. పరిగెత్తే నీటిని నడక నేర్పు, నడిచే నీటికి నిలకడ నేర్పు అనే నినాదంలో జిల్లాలో చెక్‌డ్యామ్ నిర్మాణాలను చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాకు మొదటి విడుతలో 50 చెక్‌డ్యామ్‌లు మంజూరయ్యాయి. వర్షాకాలంలో నీటిని నిల్వచేసి రైతులకు ఉపయోగపడేలా చేపట్టిన చెక్‌డ్యామ్ నిర్మాణాల్లో 40 పూర్తికాగా పదింటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
8 వేల ఎకరాలకు సాగునీరు..
జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌లో 8 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. నీటి పారుదల శాఖ ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్ సబ్ డివిజన్లో వీటి నిర్మాణాలు చేపట్టారు. గ్రామాల్లో స్థానికంగా ప్రవహించే వాగులకు అడ్డంగా చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. ఆదిలాబాద్ సబ్‌డివిజన్‌లో రూ.30 కోట్లతో 15 చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తుండగా, ఇచ్చోడ సబ్‌డివిజన్‌లో రూ. 36 కోట్లతో 18 చెక్‌డ్యామ్‌లు, ఉట్నూర్ సబ్‌డివిజన్‌లో రూ. 34 లక్షలతో 17 చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తుండగా 40 నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్మాణాలు పూర్తయిన చెక్‌డ్యామ్‌లలో ఇటీవల కురిసిన వర్షాలతో కిలోమీటర్ల మేర నీరు నిలిచింది. ఇన్ని రోజులు వృథాగా పోయిన నీటిని ఇప్పుడు చెక్‌డ్యామ్‌ల ద్వారా నిల్వ చేస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలకు సాగునీటి ఇబ్బందులు దూరమయ్యాయని రైతులు అంటున్నారు. వీటి వల్ల భూగర్భ నీటిమట్టం పెరిగి ఎండాకాలంలో స్థానికులకు తాగునీటి సమస్య ఉండదు. పశువులకు సైతం తాగునీరు లభిస్తుందని స్థానికులు అంటున్నారు.
రెండు పంటలకు సాగునీరు
మా గ్రామంలో గతంలో సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడేవాళ్లు. గతేడాది చెక్‌డ్యామ్ నిర్మించడంతో ఈ సమస్య తీరింది. వానాకాలంలో మా ఊరి పక్కన ఉన్న వాగునుంచి వాన నీరు వృథాగా పోతుండేది. ఇటీవల పడిన వానలతో చెక్‌డ్యామ్ కట్టడంతో నీరు బాగా నిలిచింది. దీంతో రెండు సీజన్లలో మోటార్లతో నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. సాగునీటి వసతి ఏర్పడడంతో వానాకాలం, యాసంగి పంటలను పండిస్తాం.
-శంకర్, రైతు. ముక్రా(కే), ఇచ్చోడ మండలం