సీఎం కేసీఆర్ దృష్టికి మారుమూల గ్రామం పేరు
వనానికి తరలివస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
ఆదర్శంగా నిలుస్తున్న సర్పంచ్, కార్యదర్శి
తానూరు, ఆగస్టు 11 : ఉమ్రి(కే).. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని మారుమూల గ్రామం. సర్పంచ్‌గా ఎన్నికైన పావులే రత్నమాల, ఆమె భర్త మారుతికి తెలుగు అసలే రాదు.. అయితేనేం.. ఊరికి ఏదో చేయాలన్న లక్ష్యం.. రాష్ట్రస్థాయిలో గ్రామం పేరు వినిపించాలన్న తపన ఆ పల్లెను ఆదర్శంగా నిలిపింది. ఏడాది క్రితం మైదానాన్ని తలపించిన ఆ ప్రదేశం.. ఇప్పుడు చిట్టడివిని మరిపిస్తూ రాష్ట్రంలోనే అగ్రపథాన నిలిచింది. ఇటీవల కలెక్టర్, అదనపు కలెక్టర్లు జిల్లాలోని అధికారులందరినీ ఆ గ్రామ ప్రకృతి వనానికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. సర్పంచ్, అధికారుల కృషిని ప్రశంసించారు.
ఆ ఊరి ప్రథమ పౌరురాలికి తెలుగు అసలే రా దు. అయితేనేం.. సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిం ది. భర్త ప్రోత్సాహంతో ఒక అద్భుత ఆలోచనకు నాంది పలికింది. టీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి, స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించడానికి చిన్న చిన్న అడవులను సృష్టించాలని సంకల్పించింది. ఆ సంకల్పంతో హరితహారంలో భాగంగా గత ఏడాది పల్లె ప్రకృతి వనాలకు శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాలోని తానూర్ మండలంలో మారుమూల గ్రామం (ఉమ్రి (కే). ఈ పల్లె మురిసిపోవడమే కాదు.. ప్రకృతిని పరవశించేలా చేసింది. సర్పంచ్ పావులే రత్నమాల తన భర్త మారుతి సహకారంతో పల్లె ప్రకృతి వనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ప్రకృతి వనాన్ని అగ్రపథాన నిలిపింది.
లక్ష్యం ఏర్పర్చుకొని..
ప్రభుత్వం గతేడాది పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించగా.. ఉమ్రి (కె) గ్రామంలో 30 గుంటల స్థలంలో మొక్కలు నాటారు. మొత్తం 3,500 మొక్కలు నాటి వాటిని కంటికి రెప్పలా కాపాడారు. అవి ఏపుగా పెరిగి చిట్టడవిలా మార్చాలనే లక్ష్యంతో సర్పంచ్ ముందుకుసాగారు. ఎప్పటికప్పుడు వనం స్థితిగతులను పరిశీలిస్తూ.. కావాల్సిన మందులను పిచికారీ చేశారు,. దీంతో ఊరంతా పచ్చగా మారింది. ఈ లక్ష్యానికి సర్పంచ్‌కు ఆమె భర్త మారుతి, ఎంపీడీవో శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి వినయ్ సహకారం అందించారు. ఇంకేముంది నాటిన మొక్కలన్నీ ప్రస్తుతం ఎదిగాయి. చెట్లుగా మారి అడవిని తలపిస్తున్నాయి. ప్రకృతి వనంలోకి వెళ్తే.. ఆహ్లాదకరమైన వాతావరణం దొరుకుతున్నది. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ ప్రకృతి వనంలో చిన్నారులు, వృద్ధులు సేద తీరుతున్నారు. వాకింగ్ చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. దీనికితోడు హరితహారంలో భాగంగా గ్రామంలో సుమారు 10వేల వరకు మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు.
కలెక్టర్ సహకారంతో..
ఉమ్రి (కె) పల్లె ప్రకృతి వనం జిల్లాలోనే మొదటి స్థానంలో నిలువగా.. ప్రస్తుతం రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచేలా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే కృషి చేశారు. పలుమార్లు ఈ ప్రకృతి వనాన్ని సందర్శించి ఇక్కడి వారికి సూచనలు, సలహాలిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కలెక్టర్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. దీనికి తోడు ఇక్కడి దృశ్యాలను సీఎం కేసీఆర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి టాప్‌లో నిలిచేలా ప్రోత్సహించారు. రాష్ట్రంలోనే ఉమ్రి ఉదాహరణగా చెప్పుకొనే రోజులు వచ్చాయని, కింది స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఇతర అధికారులు ఈ నెల 9న ప్రకృతి వనాన్ని తిలకించి మురిసిపోయారు. వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
వాకింగ్ చేస్తున్నాం..
నాలాంటి వృద్ధులు రోడ్డు పక్కన వాకింగ్ చేయాల్సి వచ్చేది. ప్రభుత్వం పల్లె ప్రకృతి వనం పార్కును ఏర్పాటు చేయడంతో మా ఊరిలో పార్కు వాకింగ్‌కు అనుకూలంగా మారింది. ప్రతి రోజూ ఇక్కడ వాకింగ్ చేస్తుండడంతో ఇబ్బందులు తొలగిపోయాయి. రాష్ట్రంలో మా ఊరికి పేరు రావడం అభినందనీయం.