నిర్మల్ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పాడి గేదెలు పంపిణీ
ఒక్కో యూనిట్‌కు రూ.50 వేలు
100 శాతం సబ్సిడీపై 77 మందికి బర్రెలు
నిర్మల్ టౌన్, ఆగస్టు 10 : తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడ్డ దళిత కుటుంబాలను ఆదుకునేందుకు పాడి గేదెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ రెండ్రోజుల క్రితమే బర్రెల యూనిట్‌ను మంజూరు చేసింది. ఒక్కో యూనిట్‌కు రూ.50 వేల చొప్పున 77 మందికి సంకరజాతి గేదెలను కొనుగోలు చేసి నిర్మల్‌కు తీసుకొచ్చారు. వ్యవసాయంతో అనుబంధం ఉన్న దళిత కుటుంబాలకు ఉపాధి అవకాశాలు, పాడి పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ బర్రెలను ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై అందిస్తున్నది. తూర్పు గోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో సంకరజాతి గేదెలను కొనుగోలు చేశారు. యూనిట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
యూనిట్ మంజూరైంది
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకున్న. ప్రభుత్వం ఇటీవల రూ. 50వేల యూనిట్‌ను మంజూరు చేసింది. అధికారులు రూ.50 వేలతో పాడి బర్రెను కొనుగోలు చేసి ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లి మూడు రోజుల క్రితమే బర్రె, దూడను తీసుకొచ్చాం. ప్రతి రోజూ పాలు అమ్ముతున్న. సర్కారు సాయమందించడం వల్ల ఉపాధి దొరికింది.
పారదర్శకంగా ఎంపిక చేశారు..
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పాడి గేదెల యూనిట్ కోసం దరఖాస్తు చేసుకున్న. అధికారులు పారదర్శకంగా ఎంపిక చేశారు. మూడు రోజుల క్రితమే అధికారులు తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లి గేదెను కొనుగోలు చేసి ఇచ్చారు. అందుకు సంబంధించిన డబ్బులను యజమానికి ఇచ్చారు. ఇప్పుడు గేదెను సాదుకుంటున్న. ప్రతి రోజూ పాలు అమ్ముతున్న. రోజూ 3 నుంచి 4 లీటర్లపాలు ఇస్తుంది. లీటర్‌కు రూ. 65 నుంచి రూ. 70 వరకు ధర ఉంది.
అదనంగా ఆదాయం
మాది నిరుపేద కుటుంబం. భార్యాభర్తలిద్దరం కూలీ పనులు చేసుకుంటం. మాకింత భూమి ఉంది. ఎవుసం కూడా చేస్తం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై గేదెల కోసం దరఖాస్తు చేసుకున్న. ప్రభుత్వం యూనిట్‌ను మంజూరు చేసింది. మొన్ననే మాకు బర్రెను ఇచ్చిన్రు. ఇగ రోజూ పాలు అమ్ముకుంటం. మాకు మరింత ఆదాయం వస్తుంది.
పాలకు డిమాండ్ ఉంది
ఊర్లళ్ల పాలు దొరకడం లేదు. పశువుల సంతతి పడిపోవడంతో పాలకు మంచి డిమాండ్ ఉంది. లీటర్‌కు రూ. 70 దాకా అమ్ముతున్నరు. అందుకే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బర్రె కోసం దరఖాస్తు చేసుకున్నా. మొన్ననే బర్రె యూనిట్ మంజూరైంది. అధికారుల సహకారంతో బర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చినం. బర్రె, దుడ్డె కలిసి రూ. 47 వేలకు కొనుగోలు చేసిన్రు. బర్రె పూటకు నాలుగు లీటర్ల పాలను ఇస్తున్నది.
మంచిగా పాలిచ్చే బర్రెను ఇచ్చిన్రు
ఇది వరకు ఉన్న సర్కారోళ్లు ఇచ్చిన బర్రెలు బక్క చిక్కి ఉండేటివి. రోగం వచ్చినయ్ కూడా ఇచ్చేటోళ్లు. ఇప్పుడట్లా కాదు. టీఆర్ఎస్ సర్కారోళ్లు మనకు ఇష్టమైన బర్రెను కొనిస్తున్నరు. ఏ బర్రెను ఎంపిక చేసుకుంటే ఆ బర్రెనే సార్లు దగ్గరుండి కొనిచ్చిన్రు. తూర్పు గోదావరి జిల్లాలో నాకు రూ. 50 వేలు పెట్టి బర్రె, దుడ్డెను ఇచ్చిన్రు.
స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి..
దళిత రైతులు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందిస్తున్నది. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా చైతన్యం కలిగిస్తున్నాం. ఎస్సీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రూ.50 వేల యూనిట్‌ను మంజూరు చేశాం. డబ్బులు చేతికి ఇవ్వకుండా నేరుగా బర్రెలను కొనుగోలు చేసి ఇచ్చాం. నిర్మల్ జిల్లాలో మొత్తం 80 మంది దరఖాస్తు చేసుకోగా.. 77 మందికి రూ. 50 వేల చొప్పున ఖర్చు చేశాం.
ఇన్సూరెన్స్ కూడా కట్టారు..
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.50 వేల రుణం మంజూరైంది. ఆ రుణంతో బర్రెను, దుడ్డెను కొనిచ్చిన్రు. ఇన్సూరెన్స్ కింద ఎస్సీ కార్పొరేషన్ అధికారులు రూ. 17,500 చెల్లించామని చెప్పారు. బర్రె ఒకవేళ మరణిస్తే తిరిగి రూ.50 వేలు ఇన్సూరెన్స్ కింద ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం ఎస్సీ రైతులను ఆదుకునేందుకు బర్రెలను కొనుగోలు చేయడంతో ఉపాధి దొరకడమే కాకుండా పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.