ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర సర్కారు
నిర్మల్ జిల్లాలో 10వేల మందికి ప్రయోజనం
సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు
నిర్మల్ టౌన్, ఆగస్టు 6: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీతో కూడిన వేతనాన్ని సర్కారు జమ చేసింది. ప్రభుత్వ పాలనలో భాగస్వాములైన ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇటీవల ప్రకటించగా, అందుకనుగుణంగా శుక్రవారం వేతనాలు ఖాతాల్లో జమ చేశారు. నిర్మల్ జిల్లాలో సుమారు 10వేల మందికి ప్రయోజనం చేకూరగా, వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తమకు అండగా నిలిచిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఈనెల 30 శాతం పీఆర్సీతో కూడిన కొత్త వేతనం విడుదల కావడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని అమలు చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, జూలై నెలకు సంబంధించిన వేతనాలకు వర్తింపజేశారు. శుక్రవారం ఈ కొత్త వేతనాలు విడుదల కావడం, ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వును తీసుకొచ్చింది. కరోనా ఆపత్కాల సమయంలో ఉద్యోగులకు మేమున్నామంటూ ముఖ్యమంత్రి కరుణ చూపుతూ పీఆర్సీ వేతనాలు జమ చేశారని కొనియాడారు. నిర్మల్ జిల్లాలో 10వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఇందులో 5,888 మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 4,850మంది పింఛనర్లు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
మా శాఖలో అందరికీ వచ్చినయ్..
నా పేరు పడిగెల వెంకటరమణ. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నా. మాశాఖలో పని చేసే ఉద్యోగులకు సంబంధించిన వేతనాల పెరుగుదల రికార్డులను ఆన్లైన్లో నమోదు చేశాను. ఇప్పుడు అందరికీ పెరిగిన వేతనాలే వచ్చినయి. పాత వేతనం రూ. 41,301 ఉండగా, ఇప్పుడు రూ. 54,931 వచ్చింది.
-వెంకటరమణ, సీనియర్ అసిస్టెంట్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ
మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి…
ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, అందుకనుగుణంగానే జూలై మాసం వేతనాలకు దానిని వర్తింపజేస్తూ విడుదల చేసి మాట నిలబెట్టుకున్నది. గత ఆరేండ్ల నుంచి రెవెన్యూ శాఖలో పని చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వంలోనే రెండుసార్లు పీఆర్సీ పెరిగింది. పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలను పెంచడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఈ నెల వేతనాల్లో అందించి, అందరికీ మంచి చేసింది.
-శ్రీదేవి, ఆర్ఐ
ముఖ్యమంత్రిపై విశ్వాసం ఉంది..
ఉద్యోగులు ఎప్పుడు ఏది కోరుకున్నా ముఖ్యమంత్రి కాదనలేదు. కరోనా సమయంలో కొంత ఆలస్యమైనప్పటికీ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చి మాపై ప్రేమను చాటుకున్నారు. ఉద్యోగులకు 7శాతం పీఆర్సీని అమలు చేయాలని కమిటీ సిపార్సు చేసినా, ముఖ్యమంత్రి పెద్ద మనసుతో 30 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేశారు. కొత్త పీఆర్సీ వేతనాల విడుదలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఈనెలలోనే వేసి, సంబురపడేలా చేసింది.
-అశోక్‌రెడ్డి, పీఆర్టీయూ లోకేశ్వరం
సంతోషంగా ఉంది..
ముఖ్యమంత్రి కేసీఆర్ సాబ్ మంచి పని చేశారు. స్వరాష్ట్రం వచ్చాక ఇది రెండో ఫిట్మెంట్ . ఈ సారి ప్రకటించిన పీఆర్సీ శుక్రవారం మా ఖాతాల్లో జమైంది. నాకు పాత జీతం రూ.70వేలు ఉండగా.. ఇప్పుడు రూ.18వేలు పెరిగి రూ. 88వేల వరకు చేరుకుంది. వేతనం పెరగడం ఆలస్యమైనప్పటికీ, కరోనా సమయంలో ఉద్యోగులపై పెద్ద మనసుతో సీఎం కేసీఆర్ వేతనాలు అందించడం అభినందనీయం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
-ఎజాజ్ అహ్మద్, సూపరింటెండెంట్, శిశు సంక్షేమశాఖ
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా..
అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ డ్రైవర్‌గా పని చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నాకు రెండుసార్లు పీఆర్సీ వచ్చింది. ఇప్పుడు కూడా 30 శాతం పీఆర్సీతో కూడిన వేతనం ఖాతాలో జమ అయింది. కరోనా కాలంలో అందరికీ ఖర్చులు పెరిగినయ్. ఉద్యోగులకు పెరిగిన వేతనం అమలు చేస్తూ ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా.
-సయ్యద్ హుస్సేన్, ఫైర్‌మెన్, అగ్నిమాపకశాఖ అధికారి
అంకిత భావంతో పని చేస్తాం..
ఈ ఫొటోలో ఉన్న వారు విజయలక్ష్మి, సవిత. నిర్మల్ ఆర్డీవో కార్యాలయంలో విజయలక్ష్మి జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తుండగా, సవిత సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. విజయలక్ష్మికి రూ. 3800, సవితకు రూ. 13,800 వేతనం పెరిగింది. ఒకేసారి ఇద్దరికి పెరిగిన వేతనం మెస్సేజ్ రావడంతో కలెక్టర్ కార్యాలయంలో తోటి ఉద్యోగులతో ఆనందం పంచుకున్నారు.
మెస్సేజ్ చూడగానే సంబుర పడ్డాను..
నేను కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తున్నా. నాకు పాత జీతం రూ. 41,455 ఉండేది. 30శాతం పీఆర్సీని అమలు చేయడంతో ఇప్పుడు రూ. 53,792 నా ఖాతాలో జమైంది. నా సెల్‌ఫోన్‌కు వచ్చిన మెస్సేజ్ చూడగానే చాలా సంతోషమన్పించింది. ఈనెల ఆరో తారీఖే పెరిగిన వేతం వేసిన్రు. ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.