33 శాతం అడవులను పెంచడమే లక్ష్యం ఎంపీ సంతోష్‌కుమార్
నిర్మల్‌లో మొక్కలు నాటిన ఎంపీ, మంత్రి అల్లోల
నిర్మల్ అర్బన్, జూలై 4 : రాష్ట్రంలో హరితహారం యజ్ఞం లా కొనసాగుతున్నదని, దేశంలోనే రాష్ట్రం హరితహారం కార్యక్రమంలో ప్రథమంగా నిలుస్తుందని ఎంపీ సంతోష్‌కుమార్, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లోని స్థానిక గాయత్రి టౌన్ షిప్ వద్ద ఆదివారం మొక్కలు నాటి హరితహారాన్ని ప్రారంభించారు. గాయత్రి టౌన్ షిప్ నుంచి కొం డాపూర్ కమాన్ వరకు మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్‌లో నాలుగు వేల మొక్కలు నాటారు. అంతకుముందు గాయత్రిటౌన్ షిప్ వద్దకు చేరుకున్న మంత్రి, ఎంపీలు ప్రత్యేక వాహనంలో పర్యటించి అందరికీ అభివాదం చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ, మంత్రి మాట్లాడుతూ.. అడవులకు పునర్జీవం పోసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారంలో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టి కోటి మొక్కల పెంపకానికి పూనుకున్నారని పేర్కొన్నారు. ఇందు లో సినిమా యాక్టర్లు, మంత్రులు, ఎంపీలు, డాక్టర్లు ఇలా అందరితో చాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నారన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ శాఖ అ ధికారులకు ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
హరితహారం కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేయాలని, ఇందు లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారన్నారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్, కలెక్టర్‌తో పర్యటించారని, పూర్తిగా ధ్వంసమైన అడవిలో పెద్దఎత్తున మొక్కలు నాటడం తో మళ్లీ అక్క డ పునర్జీవం ప్రారంభమైందని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీలో మూడు కోట్ల మొక్కలు పెంచామని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ శోభ, ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రాంకిషన్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జాయింట్ కలెక్టర్ హేమంత్‌బోర్కడే, జిల్లా ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్, ఎఫ్డీపీటీ వినోద్‌కుమార్, జిల్లా అటవీ అధికారి విక్రమ్సింగ్మీనన్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా ముత్యంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, అల్లోల మురళీధర్‌రెడ్డి, అల్లోల గౌతంరెడ్డి, అల్లోల దివ్యారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎన్.బాలకృష్ణ, ఆయా శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఆయా మండలాల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ నాయకుల ఘన స్వాగతం..
నిర్మల్ జిల్లా కేంద్రానికి తొలిసారి వచ్చిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు నిర్మల్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక సాగర్ కన్వర్షన్ హాల్ వద్ద ఎంపీ సంతోష్‌కుమార్‌కు టీఆర్ఎస్ యువజన నాయకులు అల్లోల గౌతంరెడ్డి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం అక్కడి నుంచి బైక్ ర్యాలీగా నిర్మల్‌కు చేరుకున్నారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నివాసం వద్ద ఎంపీ సం తోష్కుమార్కు జిల్లా నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు శాలువా, పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. టీఆర్ఎస్ యువ నాయకులు అల్లోల గౌతం రెడ్డి-దివ్యారెడ్డి, ఖానాపూర్, ముథోల్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, జి.విఠల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రాంకిషన్‌రెడ్డి సైతం ఎంపీని సత్కరించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గానికి చెం దిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరగా.. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
4వేల మొక్కలు నాటిన అధికారులు..
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నిర్మల్ పట్టణంలోని నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మున్సిపల్, పో లీస్, వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, జిల్లా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, వ్యవసాయ, నీటిపారుదల, సివిల్ సైప్లె, విద్యుత్, రెవెన్యూ, అటవీ శాఖలకు చెందిన ఉద్యోగులు సం యుక్తంగా నాలుగువేల మొక్కలను ఒకేసారి నాటారు. ఒక్కో శాఖకు కేటాయించిన బ్లాక్‌ల వద్ద మొత్తం 12 శాఖల అధికారులు జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. నాటిన మొక్కతో ప్రతి ఒక్కరూ సెల్ఫీ దిగి గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు వాట్సాప్ చేశారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు..
మామడ మండలంలోని బూర్గుపెల్లి రాజరాజేశ్వర ఆలయం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఎంపీ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. మొదటగా ఆలయానికి చేరుకున్న వీరికి స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫారెస్ట్ రిజర్వ్ ఏరియాలో చెట్ల పెంపకంపై ఏర్పాటు చేసిన చిత్రాలను తిలకించారు. అ నంతరం ఫారెస్ట్‌లో మంత్రి అల్లోలతో పాటు ఎంపీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రాంకిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, కలెక్టర్ ముషారఫ్‌అలీ, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.