అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శోభ
ఇచ్చోడ, జూలై 4 : ప్రతి గ్రామం పచ్చదనంతో కళకళలాడి ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ శోభ అన్నారు. ఇచ్చోడలోని పల్లె ప్రకృతి వనాన్ని ఆదివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయని పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనాన్ని సుందరంగా తీర్చిదిద్దారని, బృందావనాన్ని తలపిస్తున్నదని కొనియాడారు. ప్రతి గ్రామంలో స్వచ్ఛత నెలకొనాలని పేర్కొన్నారు. జిల్లాలో అటవీ సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రకృతి వనంలోని మొక్కలు, అందాలను ఆమె సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశారు. కార్యక్రమంలో సర్పంచ్ చౌహాన్ సునీత, ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, ఎంపీటీసీ శివకుమార్, డీఎఫ్‌వో చంద్రశేఖర్, ఎఫ్‌డీవో బర్నోబా, ఎఫ్ఆర్వో పాండురంగ్, ఎంపీడీవో రాంప్రసాద్, ఎంపీవో రమేశ్, ఏపీవో నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ రామారావ్, టీఆర్ఎస్ నాయ కులు, పాలకవర్గం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తాం..
నేరడిగొండ, జూలై 4 : కుంటాల జలపాతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని పీసీసీఎఫ్ శోభ అన్నారు. మండలంలోని కుంటాల జలపాతం వద్ద వాచ్‌టవర్ నిర్మాణాన్ని కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీసీసీఎఫ్ మాట్లాడుతూ.. కుంటాల జలపాతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతున్నదని తెలిపారు. ఇక్కడి ప్రకృతి అందాలను కాపాడడం కోసం ప్రభుత్వం పటిష్టమైన రక్షణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పర్యాటకులు ఇక్క డి అందాలను వీక్షించడానికి జలపాతం వద్ద రూ.10 లక్షలతో వాచ్‌టవర్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ వాచ్‌టవర్‌కు ఊట చెలిమ కుంటాల వాచ్ టవర్గా నామకరణం చేశారు. జలపాతం వద్ద రోప్‌వే నిర్మిస్తే పర్యాటకులకు మరింత సౌకర్యంగా ఉంటుందని కుంటాల సర్పంచ్ ఎల్లుల అశోక్ పీసీసీఎఫ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ జలపాతం రిజర్వ్డ్ ఫారెస్ట్‌లో ఉండడంతో అలాంటి నిర్మాణాలు వీలుకాదని పీసీసీఎఫ్ స్పష్టం చేశారు. జలపాతం వద్ద పీసీసీఎఫ్, కలెక్టర్ మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం జలపాతం వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి చూశారు. ఆమె వెంట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆదిలాబాద్ డీఎఫ్‌వో చంద్రశేఖర్, ఉట్నూర్ ఎఫ్‌డీవో రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్ఆర్వో వాహబ్ అహ్మద్, నేరడిగొండ ఇన్చార్జి ఎఫ్ఆర్వో రవికుమార్, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు.