రూ. 2.38 లక్షల విలువైన నిషేధిత ఉత్పత్తులు స్వాధీనం
8 మంది అరెస్ట్ రామగుండం పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ
గర్మిళ్ల, జూలై 2 : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ దందాలకు తావులేదని రామగుండం సీపీ వీ సత్యనారాయణ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన బెల్లం, పటిక, గుట్కా, నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాలలో శుక్రవారం సీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి పర్యవేక్షణలో మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్, టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి నిఖిత పంత్ ఆధ్వర్యంలో కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ సీఐలు రాజ్‌కుమార్, మహేందర్ స్థానిక పోలీస్ సిబ్బందితో ఆరు బృందాలను ఏర్పాటు చేసి జిల్లాలో పలు చోట్ల దాడులు నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన 8840 కిలోల నల్ల బెల్లం, 6680 కిలోల పటిక, సుమారు రూ. 2.10 లక్షల విలువైన గుట్కాలు, రూ. 28 వేల విలువైన 17,750 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసుల్లో రూపేశ్ అగర్వాల్, లడ్డా ప్రేంకుమార్, చంద్రశేఖర్, రమేశ్, శ్రావణ్, నరేశ్, గురువయ్య, సతీశ్‌ను అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తామని చెప్పారు. సమావేశంలో ఓఎస్డీ శరత్ చంద్ర పవర్, మంచిర్యాల టౌన్ సీఐ ముత్తి లింగయ్య, లక్షెట్టిపేట సీఐ నారాయణ నాయక్, టాస్క్ ఫోర్స్ సీఐలు రాజ్‌కుమార్, మహేందర్, ఎస్ఐలు ప్రవీణ్‌కుమార్, దేవయ్య, ఆది మధుసూదన్ రావు, లచ్చన్న, నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.