అభివృద్ధిని చూసి ఓర్వలేకే మాజీ చైర్మన్ గణేశ్ ఆరోపణలు
బహిరంగ చర్చకు మేము సిద్ధం : చైర్మన్ ఈశ్వర్
నిర్మల్ అర్బన్, జూన్ 30 : నిర్మల్ పట్టణంలోని చెరువులు, కందకాల స్థలాలను ఆక్రమించి మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చేపట్టిన నిర్మాణాలు, సంపాదించిన ఆస్తులన్నీ నిర్మల్ మున్సిపాల్టీవేనని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నిర్మల్ పట్టణాన్ని కోట్లాది రూపాయల నిధులతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని, ఆ అభివృద్ధిని ఓర్వలేకనే కుటుంబ సభ్యులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నావని అన్నారు. ఆరోపణలు చేసేముందు మీ స్థాయి ఏంటో తెలుసుకోవాలని అప్పాల గణేశ్‌పై ధ్వజమెత్తారు. భూ ఆక్రమణలు చేసినట్లు ఆధారాలుంటే బహిరంగ విచారణకు తాము సిద్ధమేనని, ఒకవేళ ఆధారాలు లేకుంటే ఆస్తులన్నీ మున్సిపాల్టీకి అప్పజెప్పి రాజకీయ సన్యాసం తీసుకునేందుకు మీరు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. 10 ఏండ్లుగా అప్పాల కుటుంబీకులే చైర్పర్సన్, చైర్మన్లుగా ఉన్నారని, ఆ సమయంలో ధర్మసాగర్ చెరువు స్థలంలో భవనాల నిర్మాణం, కందకాల స్థలంలో రిలయన్స్ ట్రెండ్ షాపింగ్ మాల్, వక్ఫ్‌బోర్డు స్థలంలో పెట్రోల్ బంక్ నిర్మించినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని తెలిపారు.
మొదటి నుంచి మంత్రి కుటుంబానిది దానం చేసే గుణమే కానీ భూములను ఆక్రమించే తత్వం కాదన్నారు. తన ఐదెకరాల భూమిని పాఠశాలకు దానం చేశాడని, అలాంటి భూమి ప్రస్తుతం రూ.30 కోట్ల విలువ ఉందని గుర్తు చేశారు. ఇంచు భూమిని కూడా మంత్రి, కుటుంబీకులు ఆక్రమించలేదని, నిర్మల్‌లో భూ బకాసురులు, కబ్జాదారులు ఎవరో పట్టణ ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో పట్టణ అభివృద్ధికి రూ.40 కోట్ల నిధులు వస్తే వాటిని ఖర్చు చేయలేదని, ఒక వేళ ఖర్చు చేస్తే మంత్రికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అడ్డుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. గతంలో వచ్చిన నిధులతో ఇప్పుడు పట్టణంలోని సుందరీకరణ పనులు చేస్తున్నారని ఆరోపించడం సరైంది కాదని, నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. కేవలం ఏడాదిన్నరలోనే పట్టణ అభివృద్ధికి రూ.14 కోట్ల నిధులను మంత్రి తీసుకొచ్చారని, ఆ నిధులతో సుందరీకరణ పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
మంత్రి దయాదాక్షిణ్యాలతో రెండు పర్యాయాలు చైర్మన్‌గా గెలిచి పదేండ్లు పరిపాలన చేసిన మీ కుటుంబ సభ్యులు పట్టణ అభివృద్ధికి ఏం చేశారో ప్రజలే చెబుతారన్నారు. మంత్రిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, వాటిని శివాజీ చౌక్ వద్ద రుజువు చేస్తానని విసిరిన బహిరంగ సవాల్‌కు మేం సిద్ధమన్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మేము ఆధారాలతో సహా నిరూపిస్తామని, నువ్వు కూడా ఇక్కడికి రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.