మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ), ఫిబ్రవరి 1 ః ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను సిట్ విచారించడంపై గులాబీ శ్రేణులు గర్జించాయి. గూడేలు, తండాలు, పల్లెలు, పట్టణాలు, యావత్ తెలంగాణ సమాజం భగ్గుమన్నది. ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అట్టుడికింది. కాంగ్రెస్ సర్కారు కుట్రలను నిరసిస్తూ జనం నిరసనలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఆదివారం భారీగా ఆందోళనలు చేపట్టారు. నల్ల జెండాలు చేతబూని రహదారులపై భైఠాయించారు. సిట్, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. శాంతియుత నిరసనలు చేపట్టినా పోలీసులు అడ్డుకోవడం, అరెస్టు చేసేందుకు యత్నించడంతో తీవ్రస్థాయిలో ఆక్షేపిస్తూ కాంగ్రెస్ సర్కారు డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొన్ని చోట్ల రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు చెదర గొట్టడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. మరికొన్ని చోట్ల ర్యాలీలు నిర్వహించారు. నల్లని గుడ్డలు ధరించి అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించారు.
ఖండించిన బీఆర్ఎస్ నాయకులు
చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, రాజకీయ దురుద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పేరిట అక్రమ పద్ధతుల్లో నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. పరిపాలన చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. బొగ్గు కుం భకోణం బయటికి రావడంతో సర్కార్‌లో ఒక్కసారిగా భారీ కుదుపు వచ్చిందని, మం త్రుల మధ్య వాటాల పంచాయితీ బయటపడిందని.. దానిని కప్పింపుచ్చుకునేందుకే సిట్ విచారణ పేరిట డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు. లొట్టపీసు కేసులో బీఆర్ఎస్ నాయకులకు భయభ్రాంతులకు గురి చేయాలని చూసిన సర్కా ర్ పప్పులు ఉడకవన్నారు. కేసీఆర్ జోలికి వస్తే తెలంగాణ జోలికి వచ్చినట్లే అంటూ మండిపడ్డారు. కేసీఆర్‌ను అవమాన పరిస్తే.. యావత్ తెలంగాణను కించపరడమేనని.. కేసీఆర్ ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల పేరిట ఆంక్షలు విధించాలని చూసిన బీఆర్ఎస్ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో శాంతియుత పద్ధతుల్లో నిరసనలు తెలపడంతో పాటు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు.

ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. ఆసిఫాబాద్‌లోని ప్రధాన రహదారిపై మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి దాసోజు శ్రవణ్‌కుమార్, ఎమ్మెల్యే కోవలక్ష్మి శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. నల్ల జెండాలతో రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేస్తూ సిట్ నోటీసు ప్రతులను దహనం చేశారు. అనంతరం ర్యాలీగా బీఆర్ఎస్ భవన్‌కు చేరుకొని నల్ల జెండా ఎగరేసి నిరసన వ్యక్తం చేశారు. ఇక మండల కేంద్రాలతో పాటు పాలు గ్రామాల్లో శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసి ఆందోళనలు చేపట్టారు.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆందోళనలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు పాల్గొన్నారు. ఐబీ చౌరస్తా నుంచి వెంకటేశ్వర టాకీస్ మీదుగా అర్చన టెక్స్ చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ వరకు, అక్కడి నుంచి ముకరాం చౌరస్తా మీదుగా మంచిర్యాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద నుంచి ఐబీ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ తీశారు. మంచిర్యాలతో పాటు చెన్నూర్, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గ కేందంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. బీఆర్ఎస్ ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

బీఆర్ఎస్ శ్రేణులపై కేసు
చింతలమానేపల్లి, ఫిబ్రవరి 1 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులివ్వడాన్ని నిరసిస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో ఆందోళనలు చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద అనుమతి లేకుండా రహదారిని అడ్డగించి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన 12 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఇస్లావత్ నరేశ్ తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే సిట్ డ్రామా
మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 1 : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల దృష్టిని మరల్చి, లబ్ధి పొందాడానికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ ద్వారా నోటీసులిచ్చి డ్రామాలు అడుతున్నది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా చేతులెత్తేసింది. రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావులపై కేసులు పెడుతూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజల దృష్టిని మరల్చడం కోసమే సిట్ నోటీసుల డ్రామా ఆడుతున్నారు. సింగరేణి టెండర్ల విషయంలో సీఎం బావమరిది సృజన్‌రెడ్డి పెద్ద ఎత్తున స్కామ్ చేశారు. ఈ విషయాన్ని హరీశ్‌రావు బహిర్గతం చేస్తే దాని నుంచి డైవర్షన్ కోసం నోటీసులు ఇస్తున్నారు. నందినగర్‌లో కేసీఆర్ ఇంటికి నోటీసు అంటించి వెళ్లడం దారుణం. కాంగ్రెస్ అరాచకాలను గుర్తించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి.
– బాల్కసుమన్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు

ప్రజాస్వామ్యానికి విరుద్ధం
మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 1 : తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్‌కు సిట్ నోటీసులివ్వడం, గోడకు నోటీసులు అంటించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధ. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుంది. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. కేసీఆర్‌పైన, హరీశ్‌రావుపైన అక్రమంగా కేసులు పెడుతున్నారు. దీనిని ప్రజలంతా గమనిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గమైన పార్టీకి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి.
– నడిపెల్లి దివాకర్‌రావు, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే
కేసీఆర్‌పై కుట్ర
ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 1 : కాంగ్రెస్ ప్రభుత్వం నీచమైన చర్యలకు పాల్పడుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉద్దేశపూర్వకంగానే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నోటీసులిచ్చారు. కాంగ్రెస్‌కు పాలన చేతగాక కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నది. ఎన్ని కుట్రలు చేసినా ఆయనకు ఏం కాదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
– కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే