ఎదులాపురం, ఆగస్టు 17 : పసికందుల పాలిట న్యూమోనియా మహమ్మారిగా మారింది. దీనిని తరిమేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పిల్లలను ఈ వ్యాధి నుంచి రక్షించేందుకు కొత్తగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఏటా 12 లక్షల శిశు మరణాలు నమోదవుతున్నాయి. 1985 సంవత్సరం నాటికి చిన్నారులను వివిధ జబ్బుల బారి నుంచి కాపాడేందుకు కేవలం 8 టీకాలు ఉండేవి.2021 నాటికి ఆ సంఖ్య 11కు చేరింది. తాజాగా న్యూమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ చేరడంతో ఆ సంఖ్య 12కు చేరింది. మన దేశంలో ఐదేండ్ల లోపు వయస్సున్న చిన్నారులు పలు రుగ్మతలతో ఏటా 12 లక్షల మంది కన్నుమూస్తున్నారు. ఇందులో న్యూమోనియా బాధితులు 2 లక్షల మంది (16 శాతం) ఉన్నారు. టీకా వేయించడంతో చిన్నారుల మరణాలను తగ్గించవచ్చు.
న్యుమోనియా.. లక్షణాలు..
న్యూమోనియా సాధారణంగా వైరస్, బ్యాక్టీరియా సంక్రమణ వల్ల సంభవిస్తుంది. ఇది నాలుగైదు రకాలుగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. వాహనాలు వెళ్తున్నప్పుడు, ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో లేచే దుమ్ముధూళి విపరీతంగా లేస్తుంది. ఆ దుమ్ముధూళి కణాల్లో ఉండే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు కలిసి చిన్నారుల్లో జలుబుకు కారణమవుతాయి. ఇది ముక్కులో నంజులా మారి న్యూమోనియాకు దారితీస్తుంది. ఐదు సంవత్సరాల్లోపు పిల్లల్లో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుంది. దీంతో విక్షణమైన సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా జ్వరం, దగ్గు ఉంటుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. రెండు నెలల కన్నా తక్కువ వయస్సున్న పిల్లల్లో దగ్గు తరచుగా ఉండదు. కొందరు పిల్లల్లో మరింత తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలతో న్యూమోనియాగా గుర్తించాలి. చర్మం నీలిరంగులోకి మారుతుంది. పాలు తాగడడానికి ఇష్టపడరు. మూర్చ వస్తుంది. ఎంతకీ వాంతులు తగ్గకపోవడం, శరీర ఉష్ణోగ్రత తీవ్రత పెరుగుతుండడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిద్వారా చిన్నారి న్యూమోనియాతో బాధపడుతున్నట్లు గుర్తించాలి.
ఆదిలాబాద్ జిల్లాకు 1500 డోసులు..
చిన్నారులను ఈ వ్యాధి నుంచి రక్షించేందుకు న్యూమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) అభివృద్ధి చేశారు. ఒక్క వాయిల్ 2.5 ఎంఎల్ ఉండగా.. దీని ధర రూ.4 వేలు. ప్రస్తుతం ప్రైవేట్‌లో రూ.5వేలుగా ఉన్నది. రాష్ట్రంలో ఈ నెల 12న న్యూమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా బుధవారం టీకా పంపిణీ ప్రారంభం కానున్నది. ఆయా లెక్కల ఆధారంగా ప్రస్తుతం జిల్లాకు 300 వాయిల్ వచ్చాయి. ఇందులో 1500 డోసులుంటాయి. 0.5 ఎంఎల్ చొప్పున ఐదుగురు చిన్నారులకు వేస్తారు. ఆరు వారాల వయస్సున్న చిన్నారులకు మొదటి డోసు, 14 వారాలకు రెండో డోసు, తొమ్మిది నెలలకు బూస్టర్ డోసు ఇస్తారు. అంగన్వాడీ సిబ్బంది సహకారంతో చిన్నారుల వివరాలను సేకరించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 6 వారాల్లోపు చిన్నారులు 250 మందిపైగా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే టీకాపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. వ్యాక్సినేషన్‌తో కలిగే ప్రయోజనాలను వివరించారు.
సద్వినియోగం చేసుకోవాలి
చిన్న పిల్లలను న్యూ మోనియా బారినుంచి కాపాడుకోవడానికి ప్రభు త్వం న్యూమోకొకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది. దీనిని చిన్నారులకు వేయించా లి. ఈ అవకాశాన్ని స ద్వినియోగం చేసుకోవాలి. కచ్చితంగా ఆరు, 14 వారాల్లోపు , తొమ్మిది నెలలకు మరోసారి ఇలా.. మూడు డోసుల వేసుకుం టే న్యూమోనియా దరి చేరదు. జిల్లాకు 1500 డోసులు వచ్చాయి. వాటిని అన్ని పీహెచ్‌సీలకు పంపించాం.ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ పీహెచ్సీలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం.
నేటి నుంచి టీకాలు పంపిణీ
నిర్మల్ జిల్లాలో బుధవారం నుంచి అన్ని ఆరోగ్య కేంద్రాల్లో న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ వేయనున్నట్లు జిల్లా వైద్యా రోగ్యశాఖ అధికారి ధన్‌రాజ్ తెలిపారు. న్యూమోకోకల్ కాంజుగేట్ టీకాపై జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ వ్యాక్సిన్ ద్వారా ఐదేళ్ల ఏళ్లలోపు పిల్లలను న్యూమోకోకల్ బ్యాక్టీరియా నుంచి కాపాడుకోవచ్చన్నారు. వ్యాధి తీవ్రత తగ్గి పిల్లల మరణాలను నివారించవచ్చని చెప్పారు. ఇప్పటికే 146 దేశాలు, దేశంలో ని 22 రాష్ర్టాలలో ఈ టీకాను పంపిణీ చేస్తున్నారన్నారు. ప్రైవేట్ వైద్యశాలల్లో ఈ టీకా ధర రూ. మూడు వేల నుంచి రూ 4 వేల వరకు ఉంటుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ టీకాను 5 ఏళ్లలోపు పిల్లలకు ఇస్తారని చెప్పారు. పుట్టిన తర్వాత ఆరు వారాలకు మొదటి డోస్, 14 వారాలకు రెండో డోస్, 9 నెలలకు బూస్టర్ డోస్ వేస్తారన్నారు. టీకా తీసుకోవడంలో ఆలస్యమైతే మొదటి పుట్టిన రోజుకు కనీసం ఒక మోతాదు తీసుకొని ఉంటే ఎనిమిది వారాల విరామం తర్వాత తదుపరి డోసులు వేస్తారని వివరించారు. ఇప్పటికే పీసీవీపై జిల్లాలో ఉన్న వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. సమావేశంలో సర్వేలైన్స్ వైద్యాధికారి (ప్రపంచ ఆరోగ్య సంస్థ) డాక్టర్ అతుల్, ప్రోగ్రాం అధికారి అరుణ్, డీటీవో శ్రీనివాస్‌రెడ్డి, డీపీవో వెంకటేశ్వర్రావు, డీపీఆర్వో తిరుమల, అధికారులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ అంబేద్కర్‌చౌక్, ఆగస్టు 17 : జిల్లాలో నేటి నుంచి ఏడాది లోపు పిల్లలకు న్యూమోకోకల్ కాంజుగేట్ టీకా వేయనున్నట్లు డీఎంహెచ్‌వో మనోహర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టీకా వలన ఐదేళ్లలోపు పిల్లలో సంభవించే మరణాలకు కారణమైన న్యుమోనియా, మెదడువాపు, సెస్టిసెమి యా వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని తెలిపారు. టీకా ప్రతి బుధవారం, శనివారం సీహెచ్‌సీలు, పీహెచ్సీలలో ఉచితంగా అందుబాటులో ఉంటాయని, మొదటి డోసు ఆరు వారాలకు, రెండో డోసు 14 వారాలకు, బూస్టర్ డోసు 9 నెలలకు వేయనున్నట్లు పేర్కొన్నారు.