భైంసా, ఏప్రిల్ 13 : విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. భైంసా పట్టణంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. భైంసా పర్యటనకు వచ్చిన కలెక్టర్‌ను పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు విశ్రాంతి భవనంలో కలిశారు. ప్రిన్సిపాల్ విద్యార్థులను ఇంటికి పంపించడం లేదని, ధ్వంసమైన టీవీకి సంబంధించిన డబ్బులు కట్టిన తర్వాతే విద్యార్థులను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు తెలిపినట్లు వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో స్పందించిన ఆయన.. పాఠశాలను సందర్శించారు. పగులగొట్టిన టీవీ, ధ్వంసం చేసిన బాత్రూం తలుపులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. టీవీ ఎందుకు పగులగొట్టారని విద్యార్థులను ప్రశ్నించారు. విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో ఉంటూ పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకరావాలని తెలిపారు. కాగా, పిల్లల వద్ద ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఇంటికి పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెళ్లిపోయారు.
విజయ డెయిరీ పరిశీలన
భైంసా పట్టణంలోని విజయ పాల యూనిట్‌ను కలెక్టర్ వరుణ్ రెడ్డి సందర్శించారు. భైంసాలోని బీఎంసీ యూనిట్లో రోజుకు 1800 లీటర్ల పాల సేకరణ జరుగుతున్నదని తెలిపారు. పూర్తి సామర్థ్యం 3 వేల లీటర్లకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రా మంలో పాల సేకరణ తీరును క్షుణ్ణంగా పరిశీలించి వెన్నశాతం, ధర వివరాలను సవివరం గా అడిగి తెలుసుకోవాలన్నారు. ఈయన వెం ట పాల శీతలీకరణ కేంద్రం మేనేజర్ దస్రు, బీఎంసీ ఇన్చార్జిలు సాయన్న, గజ్జారాం, సూపర్వైజర్లు రమేశ్, సంతోష్, కాంతారావు, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, విజయ పంపిణీదారు రమణారెడ్డి తదితరులున్నారు.