నిర్మల్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ 14 ఏండ్ల పాటు పోరాటం చేసి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం వల్లే ఈ రోజు ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రూపురేఖలు మారిపోయాయన్నారు.
ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్నాయని, 3వ తేదిన ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్‌కు వచ్చి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనడం అందరి అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అది కూడా యాగం చేసుకొని రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. లోక కళ్యాణం కోసం యాగం నిర్వహించి, ఇక్కడికి రావడంపై నియోజకవర్గ ప్రజలందరి తరఫున సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. తెలంగాణ రాకముందు మన బతుకులు ఏ విధంగా ఉండేవో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రం వచ్చాక నిర్మల్ జిల్లా కేంద్రమైందని, మెడికల్ కాలేజీ వచ్చిందని గుర్తుచేశారు.
అలాగే రూ.714 కోట్లతో దిలావర్పూర్ మండలంలో శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకున్నామని, దీంతో నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు సాగునీరందుతున్నదని వివరించారు. అలాగే సోన్ మండలం పాక్పట్ల వద్ద రూ.300 కోట్లతో పామాయిల్ పరిశ్రమకు ఇటీవలే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామని గుర్తుచేశారు. ఈ పరిశ్రమతో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. నిర్మల్ మున్సిపాలిటీతో పాటు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని తెలిపారు. ముఖ్యంగా సాగు, తాగు నీటి రంగంతో పాటు, కరెంటు విషయంలో ప్రజలు ఎదుర్కొన్న ప్రతీ సమస్యను పరిష్కరించామన్నారు.
సీఎం కేసీఆర్‌కు నిర్మల్ అంటే చాలా ప్రేమ, అభిమానం ఉన్న విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలని, అడిగిన వెంటనే కాదనకుండా నిధులిచ్చి నియోజకవర్గాన్ని అన్న రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఇంకా రెండు మూడు సమస్యలు ఉన్నాయని, జిల్లా కేంద్రంలో జనాభా లక్షా 50 వేల వరకు పెరిగిన నేపథ్యంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాల్సి ఉందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి తొందరలోనే అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని, అలాగే నిర్మల్ మున్సిపాలిటీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రూ.100 కోట్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.
వీటితోపాటు స్వర్ణ ప్రాజెక్టు కింద రూ.20 కోట్లతో కాలువల లైనింగ్ కోసం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామని, వాటిని కూడా మంజూరు చేయాలన్నారు. ఈ లైనింగ్ పనులు పూర్తయితే సారంగాపూర్ మండలంలోని దాదాపు 15 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఎస్సారెస్పీ ముంపునకు గురైన దిలావర్పూర్, బన్సపెల్లి, లోలం, కంజర్ గ్రామాలకు సాగు నీరందించేందుకు గతంలో గోదావరి నుంచి ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ, అది చెడిపోయి చాలా కాలంగా పనిచేయడం లేదన్నారు.
పాత పైప్‌లైన్ స్థానంలో కొత్తది మారిస్తే ఆయా గ్రామాల వ్యవసాయ భూములకు మళ్లీ సాగునీరందించవచ్చని పేర్కొన్నారు. ఇందుకు రూ.90 కోట్ల వరకు అవసరమవుతాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్న నిర్మల్‌కు జేఎన్టీయూ అనుబంధంగా ఒక ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేయాలని కోరారు. ఇటీవల నిర్మల్ పర్యటనకు వచ్చిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఇక్కడ ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. అలాగే నిర్మల్ పట్టణంలో సమీకృత మార్కెట్ నిర్మాణం కోసం రూ.10 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
నిర్మల్ నియోజకవర్గం సీఎం సహకారం వల్ల అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే కోట్లాది రూపాయల ని ధులు మంజూరు చేసిందని చెప్పారు. నిర్మల్‌లో మ సీదుల నిర్మాణం కోసం రూ.3.5 కోట్లు ఇచ్చామని, షాదీఖాన కోసం రూ.5 కోట్లు మంజూరు చేశామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ మైనారిటీ బంధును అందజేస్తామన్నారు. క్రిస్టియన్లకు రూ.2 కోట్లు ఇచ్చామని తెలిపారు. ఇలా అన్ని వర్గాలకు మేలు చేసేది ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలంటే ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలని ఈ సందర్భంగా ప్రజలను ఆయన కోరారు.
నిర్మల్ అర్బన్, నవంబర్ 2 : నిర్మల్ పట్టణంలోని ఎల్లపెల్లి క్రషర్ వద్ద గురువారం ప్రజా ఆశీర్వాద సభకు నిర్మల్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మహిళలు, యువతులు, యువకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే తండోపతండాలుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కొన్ని నిమిషాల్లోనే అంతా నిండిపోయింది.
యువ నాయకురాలు, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోడలు అల్లోల దివ్యారెడ్డి సభా ప్రాంగణంలోని అన్ని గ్యాలరీలోల కూర్చున్న బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు, మహిళలు, యువతులను కలిశారు. ఆప్యాయంగా పలుకరించి, కారు గుర్తుకు ఓటు వేసి ఇంద్రకరణ్ రెడ్డిని ఎమెల్యేగా, కేసీఆర్‌ను సీఎంగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెతో సెల్ఫీలు తీసుకున్నారు. ఆమె వెంట అల్లోల శిరీషా రెడ్డి తదితరులున్నారు.