ఇచ్చోడ, ఫిబ్రవరి 24 : ప్రభుత్వ బడుల రూపురేఖలు మారబోతున్నాయి. త్వరలోనే కొత్త వెలుగులు సంతరించుకోబోతున్నాయి. అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకే ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడుతలో ఇచ్చోడ మండలంలో 17, సిరికొండ మండలంలో 7 పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. ప్రతి పాఠశాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో దాతలను ప్రోత్సహించి, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇచ్చోడ మండలంలో అడెగామ(బీ), ఇస్లాంనగర్, ముక్రా (బీ), కోకస్మన్నూర్, ఇచ్చోడ జడ్పీఎస్ఎస్, కేశవపట్నం, నర్సాపూర్, గుండాల తెలుగు మీడియం, కోకస్మన్నూర్, ఇచ్చోడ యూపీఎస్, కేశవపట్నం, ఎల్లమ్మగూడ, గుండాల, జోగిపేట, ఇచ్చోడ ఎస్సీ కాలనీ, ఇచ్చోడ ఉర్దూ మీడియం, ఇచ్చోడ ఉర్దూ మీడియం జడ్పీఎస్ఎస్, సిరికొండ మండలంలోని పొన్న, సుంకిడి యూపీఎస్, సిరికొండ జడ్పీఎస్ఎస్, సిరికొండ పీఎస్, సోన్పల్లి, కన్నాపూర్ పాఠశాలలు ఎంపికయ్యాయి.
మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా ఆయా పాఠశాలల్లో మొత్తం 12 రకాల పనులు చేపట్టనున్నారు. ప్రహరీల నిర్మాణం, కిచెన్షెడ్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నీచర్, డిజిటల్ విద్య, గ్రీన్చాక్ బోర్డుల ఏర్పాటు, పాఠశాలల గదులకు మరమ్మతులు, శిథిలావస్థలో ఉన్న గదులను తొలగించి కొత్తవి నిర్మించడం, మరుగుదొడ్లలో నీటి వసతి కల్పించుట, మధ్యాహ్న భోజనానికి డైనింగ్హాల్స్ నిర్మాణం, తాగునీటి వసతి పనులు చేపట్టనున్నారు. పాఠశాలలు ఎంపికైన గ్రామాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మండలంలో మన ఊరు- -మన బడి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. మొదటి విడుతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో 12 రకాల పనులు చేపట్టనున్నాం. మూడు నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజాప్రతినిధులు, ప్రజల సమన్వయతో ఈ పథకాన్ని లక్ష్యం మేరకు పూర్తి చేయడానికి కృషి చేస్తాం. -రాథోడ్ ఉదయ్రావ్, ఎంఈవో, ఇచ్చోడ