మంచిర్యాల (ఏసీసీ), నవంబర్ 28 : అంగన్వాడీ పిల్లలకు ఇవ్వాల్సిన యూనిఫాంలపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నిజానికి జూలైలోనే అందించాల్సి ఉండగా, నవంబర్ పూర్తికావస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. కుట్టే ప్రక్రియ పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉండగా, పై నుంచి ఆదేశాలు రాక మూలన పడేసినట్లుగా తెలుస్తున్నది.
ఊసెత్తని సర్కారు
జిల్లాలో 969 అంగన్వాడీ కేంద్రాలుండగా, 43,824 మంది పిల్లలు చదువుకుంటున్నారు. జిల్లాలో లక్షెట్టిపేట, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లిలో నాలుగు ఐసీడీఎస్ కేంద్రాలుండగా, ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న 319 అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు యూనిఫాంలు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. తొలి విడుతలో 1784 బాలురు, 1825 బాలికలకు అందించాలనుకున్నది. నీలిరంగు నిక్కర్ల కోసం 1306 మీటర్లు, ఎరుపు రంగు షర్టు, ఫ్రాకు కోసం 5059 మీటర్లు, తెలుపు రంగు కోసం 920 మీటర్ల బట్టను టెస్కో ద్వారా సేకరించారు. కుట్టు బాధ్యతలను సెర్ప్, మహిళా సంఘాలకు అప్పగించారు. వాస్తవానికి జూలైలోనే పిల్లలకు యూనిఫాంలు అందించాల్సి ఉంది. కానీ అనేక కారణాల దృష్ట్యా ఆలస్యమైంది. ప్రస్తుతం కుట్టు పూర్తయినా ప్రభుత్వం పంపిణీ ఊసెత్తడం లేదు. విద్యా సంవత్సరం పూర్తికావస్తోందని, ఇంకెప్పుడు యూనిఫాంలు అందిస్తారని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
పట్టింపు కరువు
కేసీఆర్ సర్కారు బడులు, అంగన్వాడీలకు ప్రత్యేకంగా ని ధులు కేటాయించి ఎంతో అభివృద్ధి చేసింది. కార్పొరేట్‌కు దీ టుగా సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యనందించిం ది. అంగన్వాడీలను మరింత బలోపేతం చేసేందుకు అనేక కా ర్యక్రమాలు చేపట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వా త వాటిపై పట్టింపు కరువైందన్న ఆరోపణులు వినిపిస్తున్నాయి. అంగన్వాడీలను పటిష్టం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదన్న ఆరోపణలున్నాయి. కనీసం పిల్లలకు అందించే యూనిఫాంలపైనా ఇంతటి నిర్లక్ష్యమెందుకని పలు విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
త్వరలోనే పంపిణీ చేస్తాం..
యూనిఫాంల స్టిచ్చింగ్ పూర్తయ్యింది. జిల్లాకు చేరుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. మరో రెండు వారాల్లో చిన్నారులకు యూనిఫాంల పంపిణీ జరుగుతుందని ఆశిస్తున్నాం.
– స్వరూపారాణి, జిల్లా సంక్షేమాధికారిణి