శ్రీరాంపూర్, జూలై 8 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి. కార్మికుల హక్కులను హరించడమే లక్ష్యంగా ఈ కోడ్లను రూపొందించారని కార్మిక సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. నాలుగు లేబర్ కోడ్లు కార్మికులు, ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలు, బ్యాంకింగ్, ఎల్ఐసీ, కోలిండియా, సింగరేణి, రైల్వే అన్ని రంగాల ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థల ఉద్యోగులకు హక్కులు హరిస్తాయి.
ముఖ్యంగా ఈ చట్టాలు పరిశ్రమల యాజమాన్యాలకు అనుకూలంగా రూపొందించారు. బ్యాంకింగ్, ఎల్ఐసీ, రైల్వే, కోల్ ఇండియా, సింగరేణి వంటి కీలక రంగాల్లోని ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనున్నారు. ఫిక్స్టర్మ్ ఎంప్లాయిమెంట్ విధానం, యూనియన్ల గుర్తింపు నిబంధనలు, పింఛన్ నిబంధనల మార్పులు, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు లేకపోవడం వంటి అంశాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నూతన కోడ్లతో పది గంటల పని విధానం అమలవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అందవు.
కార్మికుల హక్కులు కాలరాసే చట్టాలను సమ్మెతో తిప్పికొట్టాలి
దేశ వ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికుల హక్కులు కాలరాసే నల్ల చట్టాల నాలుగు కోడ్లను సమ్మెతో తిప్పికొట్టాలి. లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేసి, పోరాడి సాధించుకున్న పాత చట్టాలు అమలు చేయాలి. సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనాలి. బీజేపీ కార్పొరేట్ సంస్థల అనుకూల చట్టాలు వెంటనే రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కోడ్లు అమలు చేయలేమని, రద్దు చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి. సింగరేణి సహా అన్ని రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొని న్యాయం సాధించాల్సిన అవసరం ఉంది.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి