‘ఏప్రిల్ 9వ తేదీన శ్రీకారం చుట్టిన ‘మెస్సేజ్ యువర్ ఎస్పీ’కి స్పందన చాలా బాగుంది. వేగంగా న్యాయం జరుగుతుండ డంతో విశేష స్పందన లభిస్తున్నది. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడంతో సామాన్యులు ధైర్యంగా ముందు కొస్తున్నారు. గతంలో గ్రామాలు, పట్టణాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు మనకెందుకులే ఎవరికి వారే మౌనంగా ఉండేవారు. ఫిర్యాదు చేస్తే అవతలి వారికి పగదారులం అవుతామని భావించేవారు. కానీ.. ‘మెస్సేజ్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత సామాన్యులు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడం సంతోషంగా ఉంది.’ అని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ‘నమస్తే’ ఇంటర్వ్యూలో తెలిపారు.
– ఎదులాపురం, ఏప్రిల్ 29
నమస్తే : ‘మెస్సేజ్ యువర్ ఎస్పీ’ ఆలోచన ఎలా వచ్చింది?
ఎస్పీ అఖిల్ మహాజన్ : మహిళలు, ఆడపిల్లలు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయా లంటే భయపడడం సహజం. అయితే వాళ్లు స్టేషన్‌కు రాకున్నా పోలీసుల తరఫున వారి కోసం ఒక మొబైల్ నంబర్ ఏర్పాటు చేశాం. మారుముల గ్రామాలకు చెందిన వారికి సేవలు అందాలనే సంకల్పంతో ప్రారంభించాం. గతంలో పని చేసిన జిల్లాల్లో అమలు చేశా. అక్కడ మంచి ఫలితాలు వచ్చాయి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభించా.
నమస్తే : ఏఏ విషయాల్లో ఫిర్యాదు చేయవచ్చు?
ఎస్పీ : ఆపదలో ఉన్నవారితోపాటు, మన చుట్టు పక్కల అసాంఘిక కార్యకలాపాలు, వేధింపులు, భార్యాభర్తల మధ్య గొడవ, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియాలో ఇబ్బందులు పెట్టిన, చిన్న, పెద్ద తేడా లేకుండా మెస్సేజ్ యువర్ ఎస్పీకి మెస్సేజ్ లేదా వాయిస్ రూపంలో ఫిర్యాదు చేయవచ్చు.
నమస్తే : ఎంత సమయంలో సమస్యలను పరిష్కారం చేస్తున్నారు?
ఎస్పీ : ‘మెస్సేజ్ యువర్ ఎస్పీ’కి ఫిర్యాదు వచ్చిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమచారం ఇస్తున్నాం. ఆ తరువాతే బాధితులకు న్యాయం చేస్తాం. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నం. వాట్సాప్ నంబర్‌ను నేనే పరిశీలిస్తూ ఉంటా.
నమస్తే : ఎన్ని మెస్సేజ్‌లు వచ్చాయి?
ఎస్పీ : ఈనెల 9వ తేదీన కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటికీ 21రోజులు అవుతున్నది. 255 మెస్సేజ్‌లు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు 60 శాతం పరిష్కరించాం. మిగిలిన 40 శాతంలో కొన్ని తప్పుడు, ఒకరిపై ఒకరు వ్యక్తిగత కక్షలతో ఫిర్యాదు చేశారని తేలింది. మెస్సేజ్ సరైన సమచారం ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయి.
నమస్తే : కార్యక్రమం ఎప్పటి వరకు అమలులో ఉంటుంది?
ఎస్పీ : నేను జిల్లా నుంచి బదిలీ అయ్యే వరకు అమలులో ఉంటుంది. నేరుగా ఫిర్యాదు చేయలేనివారు, సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు, పట్టణంలో ఎరైనా సరే వాట్సాప్ మెస్సేజ్ రూపంలో 87126 59973 మొబైల్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారికి జిల్లా పోలీసులు అండగా ఉంటారు.
నమస్తే : జిల్లావాసులకు మీరు ఏమి చెబుతారు?
ఎస్పీ : ఇబ్బందులు, భయం ఉన్నా, ముఖ్యంగా పోలీస్ శాఖ, ఇతర శాఖలకు సంబంధించిన వారిపైన వాట్సాప్ రూపంలో ఫిర్యాదు చేయవచ్చు. తప్పు చేసిన వారైనా సరే విడిచి పెట్టేది లేదు. కచ్చితంగా కేసు నమోదు చేస్తాం. బాధితులకు న్యాయం చేసి అండగా ఉంటాం.