ఇంద్రవెల్లి, డిసెంబర్ 27 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు వచ్చే భక్తులకు రహదారి కష్టాలు తప్పేలా లేవు. జనవరి 18న నాగోబా మహాపూజకు మెస్రం వంశీయులు సిద్ధం అవుతున్నారు. ఎడ్లబండి ప్రచారం నిర్వహించి ఈనెల 29ని కేస్లాపూర్ చేరుకోనుండగా.. 30వ తేదీన గంగాజలం సేకరణకు మెస్రం వంశీయులు బయలుదేరనున్నారు. మహాపూజలతోపాటు జాతర నిర్వహణ సమయం దగ్గర పడుతున్నా అధికారులు రోడ్లకు మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మెస్రం వంశీయుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
ముత్నూర్ నుంచి కేస్లాపూర్ మీదుగా దస్నాపూర్ వరకు ఉన్న బీటీ రోడ్డు అడుగడుగున గుంతలు ఏర్పడి ఆధ్వానంగా మారింది. ఈ రోడ్డు మార్గం నుంచి నిత్యం వందలాది మంది భక్తులతోపాటు మెస్రం వంశీయుల కుటుంబాలు, ప్రజలు ప్రయాణిస్తుంటారు. అడుగడుగున గుంతలు ఉండడంతో ప్రయాణికులు వణికిపోతున్నారు. ప్రభుత్వం రోడ్డు వెడల్పుతోపాటు మరమ్మతులకు రూ.15 కోట్లు మంజూరు చేసినా, అధికారులు ఇప్పటివరకు పనులు ప్రారంభించ లేదు. కేస్లాపూర్ నుంచి హర్కాపూర్ ఎక్స్‌రోడ్డు వరకు ఉన్న మట్టి రోడ్డు కంకర తెలింది. ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి.
నాగోబా ఆలయం నుంచి మెండపల్లి వరకు కూడా ఉన్న మట్టిరోడ్డు ఆధ్వానంగా మారింది. జాతరకు వచ్చే భక్తులు, మెస్రం వంశీయులు రాకపోకలు చేస్తుంటారు. నాగోబా మహాపూజలకు సమయం దగ్గర వస్తున్న సంబంధిత శాఖల అధికారులు మాత్రం రోడ్లు మరమ్మతులపై ఇప్పటివరకు దృష్టి సారించలేదని మండల ప్రజలు, భక్తులు, మెస్రం వంశీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బాగు చేయాలని కోరుతున్నారు.

నాగోబా జాతరకు వచ్చే భక్తులతోపాటు మెస్రం వంశీయులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇప్పటికే మెస్రం వంశీయులు నాగోబా మహాపూజలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 18న నిర్వహించే మహాపూజకు ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. జిల్లా అధికారులు నాగోబా జాతరపై ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్ల పనులు మొదలు చేయాలి.
-మెస్రం షేకు, నాగోబా ఆలయ పూజారి
కేస్లాపూర్ గ్రామానికి అనుసంధానం కలిగిన రోడ్ల గురించి యేటా అధికారులకు తెలుపుతున్నాం. జాతర వచ్చినప్పుడే తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు. శాశ్వత రోడ్డు నిర్మాణాలు చేయాలి. ముత్నూర్ నుంచి కేస్లాపూర్ వరకు బీటీ రోడ్డుకు గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. నాగోబాకు నిర్వహించే మహాపూజలతోపాటు జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు గురికాకుండా చూడాలి. గుంతలతో ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రోడ్లకు మరమ్మతులు చేసి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా రహదారులు బాగు చేయించాలి.
– మెస్రం వెంకట్రావ్ పటేల్, నాగోబా ఆలయ పీఠాధిపతి.