ఇంద్రవెల్లి, జనవరి 29 ః మెస్రం వంశీయులు మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన మహాపూజతో నాగోబా జాతర ప్రారంభమైంది. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి బారులుదీరి నాగోబాను దర్శించుకున్నారు. మహాపూజ అనంతరం 52 జతల (104 మంది) కొత్తకోడళ్లకు నాగోబా సన్నిధిలో పరిచయ (బేటింగ్) కార్యక్రమాన్ని మెస్రం వంశీయులు పెద్దల సమక్షంలో నిర్వహించారు.
అనంతరం కొత్త కోడళ్లకు నాగోబాను దర్శించుకునే అవకాశం కల్పించారు. సతిక్ దేవత, నాగోబాను దర్శించుకున్న కొత్తకోడళ్లు మెస్రం వంశీయుల పెద్దల ఆశీస్సులు తీసుకుని, మెస్రం వంశీయుల కోడళ్లుగా మారారు. తర్వాత సంప్రదాయబద్ధంగా గోవాడ్లో ప్రవేశం కల్పించారు.
మహిళలతోపాటు కొత్తకోడళ్ల ఆధ్వర్యంలో 22 కితలవారీగా అవ్వాల్ దేవతకు సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు చేశారు. నైవేధ్యం సమర్పించి అవ్వాల్ దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఉపవాస దీక్షలను విరమించి సామూహిక భోజనాలు చేశారు. గోవాడ్లో కొత్త కోడళ్లు, మహిళలు దీపాలు వెలిగించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్, ఉట్నూర్ సీఐ మొగిలి, ఇంద్రవెల్లి ఎస్ఐ సునీల్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.