ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ ( Adilabad ) జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో కోలువుదిరిన ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా దేవతకు మెస్రం వంశీయులు ఆదివారం అర్థరాత్రి నిర్వహించిన మహాపూజతో నాగోబా జాతర ( Nagoba Jatara ) వైభవంగా ప్రారంభమైంది.

జన్నారం మండలం హస్తినమడుగు నుంచి సేకరించిన పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించి జాతరను ప్రారంభించారు. గ్రామంలోని మురాడీ నుంచి పురాతన నాగోబా విగ్రహంతోపాటు పవిత్ర గంగాజలంతో మెస్రం వంశీయులు నాగోబా ఆలయానికి చేరుకున్నారు. పురాతన నాగోబా విగ్రహాన్ని ఆలయంలోని విగ్రహం వద్ద ఉంచి పూజలు చేశారు. నాగోబా ఆలయం వెనుక భాగంలో పవిత్రమైన గంగాజలం ఝరిను భద్రంగా ఉంచారు.

మెస్రం వంశీయులు నిర్వహించిన నాగోబా మహాపూజలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, అనిల్ జాదవ్, పాయల శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
