మంచిర్యాల, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ః తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) సిద్ధమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చిన మరుసటి రోజే అన్ని జిల్లాల రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసి రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. అదే రోజు రిజర్వేషన్లపై కొందరు కోర్టుకు వెళ్లారు. అసెంబ్లీలో చేసిన తీర్మానం గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగానే, రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడం ఏంటని కోర్టు ప్రశ్నించింది.
పది రోజులపాటు నోటిఫికేషన్ ఇవ్వకూడదని ఆదేశించింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ను విడుదల చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ముందుగా రెండు విడుతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మూడు విడుతల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
అక్టోబర్ 9వ తేదీ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. అదే రోజు నామినేషన్ల స్వీకరణ మొదలుకానున్నది. అక్టోబర్ 23వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు తొలి విడుత, అదే నెల 27న రెండో విడుతలో పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 17వ తేదీన తొలి విడుత సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేనున్నారు.
అక్టోబర్ 31వ తేదీ సర్పంచ్ ఎన్నికలకు తొలి విడుత పోలింగ్ ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి రెండో విడుత సర్పంచ్ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 4న రెండో విడుత పోలింగ్, అక్టోబర్ 25న మూడో విడుత నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 8వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. కాకపోతే సర్పంచ్ ఎన్నికలు ముగిసిన అనంతరం నవంబర్ 11వ తేదీన ఎంటీపీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.
సిద్ధమైన అధికార యంత్రాంగం
ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. మంచిర్యాల జిల్లాలో 16 జడ్పీటీసీ, 129 ఎంపీటీసీ, 306 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు 3,394 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
పంచాయతీ ఎన్నికలకు 2,680, పరిషత్ ఎన్నికలను 714 కేంద్రాల్లో నిర్వహించనుండగా 3,76,669 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 20 జడ్పీటీసీ, 168 ఎంపీటీసీ, 473 సర్పంచ్ స్థానాల్లో 4,47,135 మంది ఓటర్లు, ఆసిఫాబాద్ జిల్లాలో 15 జడ్పీటీసీ, 127 ఎంపీటీసీ, 334 సర్పంచ్ స్థానాల్లో 3,53,904 మంది ఓటర్లు, నిర్మల్ జిల్లాలో 18 జడ్పీటీసీ, 157 ఎంపీటీసీ, 400 సర్పంచ్ స్థానాల్లో 4,49,302 మంది ఓటర్లు ఉన్నారు.
వీరంతా ఓటు వేసేందుకు వేల సంఖ్యలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అధికారులకు కొన్ని జిల్లాల్లో శిక్షణ పూర్తికాగా, కొన్ని జిల్లాల్లో శిక్షణ కొనసాగుతున్నది. పోలింగ్ సామగ్రి కోసం గతంలోనే టెండర్లు పిలిచిన అధికారులు, పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే ఆ సామగ్రిని చేరవేశారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గ్రామాల్లో మొదలైన సందడి
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల పండుగ మొదలైంది. ఎన్నికల్లో పోటీ చే సేందుకు సిద్ధమైన ఆశావహులు, రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన గ్రామాల్లో ఇప్పటికే ఓటర్లను ప్ర సన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. సద్దుల బతుకమ్మ, ద సరా, దీపావళి పండుగలను దృష్టి లో ఉంచుకొని మహిళలు, యువతను ఆకర్షించేందుకు ఎత్తులు వేస్తున్నా రు. దసరా పండుగ అక్టోబర్ 2వ తేదీ గాంధీ జ యంతి రోజున వస్తుండడంతో దానికి ఒక్క రోజు ముందు లేదా మరుసటి రోజు మద్యం, మాం సం పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.
వార్డులు, వాడకట్లలో ఇప్పటికే ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నారు. వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మేకలు, గొర్రెలతోపాటు మద్యం పంపిణీ చేస్తామంటూ అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు. దీంతో గ్రా మాల్లో ఈసారి పండుగలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సద్దుల బతుకమ్మ కోసం ఇప్పటికే డీజేలు ఏర్పాటు చేయడం, సొంత ఖర్చులతో లైటింగ్, బతుకమ్మ ఘాట్ల సుం దరీకరణకు చాలా మంది ముందుకొచ్చారు. దీంతో ఎన్నికల హడావుడి గ్రామాల్లో మొదలైపోయింది. ఓ వైపు రిజర్వేషన్లపై అక్టోబర్ 8వ తేదీన కోర్టు హియరింగ్ ఉన్న నేపథ్యంలో ఎన్నికలపై ఇంకా సందిగ్ధత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఆశావహులు మాత్రం తగ్గేదేలే అంటూ ఎన్నికలకు కాలు దువ్వుతున్నారు.