భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖామాత్యులు కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) బెల్లంపల్లి నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం, బెల్లంపల్లి పట్టణాల్లో పర్యటించిన ఆయన రూ.114.89 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో పాల్గొని ప్రసంగించారు. రూ.2 వేల కోట్లతో దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీని విస్తరిస్తామని, దీంతో 4 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అభివృద్ధి పనులకు మరో రూ.50 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను త్వరలోనే మంత్రి అల్లోల, విప్ సుమన్ ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఏడు వేల మందికి సింగరేణి పట్టాలు అందించిన ఘనత మనదేనని పేర్కొన్నారు. మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేస్తే మీరు అడిగిన ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంచి మనిషని.. ఆయనను ఎదురించే సత్తా లేకే శిఖండి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
మంచిర్యాల, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేవాపూర్‌లో రూ.2 వేల కోట్లతో సిమెంట్ ఫ్యాక్టరీని విస్తరించి, బెల్లంపల్లి నియోజకవర్గంలోని సుమారు 4 వేల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే మహత్తర ఘట్టానికి మంత్రి కేటీఆర్ సోమవారం అంకురార్పణ చేశారు. అలాగే ఎంతో మందికి ఉపాధి స్వర్గధామంగా మారనున్న 350 ఎకరాల స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ను శంకుస్థాన చేయడంతోపాటు, అక్కడ రూ.20 కోట్లతో చేపట్టనున్న పనులను ప్రారంభించారు. ఒక్కరోజే రూ.114.89 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో మంత్రి మాట్లాడుతూ.. ‘ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నది. ఇంకా సున్నపు రాయి నిక్షేపాలున్నాయ్. మా పిల్లలకు కొలువులు కావాలంటే ఫ్యాక్టరీని విస్తరించాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టుబట్టారు.. అందుకే ఇవాళ ముందుగా దేవాపూర్‌కు వెళ్లి సిమెంట్ కంపెనీని విస్తరించి, కొత్తగా 4 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి శంకుస్థాపన చేశాం’ అని అన్నారు. అదయ్యాక ఎమ్మెల్యే చిన్నయ్య అన్నా.. సిమెంట్ ఫ్యాక్టరీ పెరిగితే, రాష్ట్ర ఖజానాకు ఆదాయం వస్తే సంతోషమే. కానీ.. దానికంటే ఎక్కువ సంతోషం బెల్లంపల్లి పిల్లలకు ఉద్యోగాలు వచ్చినప్పుడే ఉంటుందన్నారు. దాని కోసం బెల్లంపల్లిలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని అడిగారని పేర్కొన్నారు. ఆయన కోరిక మేరకు అతి త్వరలోనే బెల్లంపల్లిలో మం త్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చేతుల మీదుగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తామన్నారు. శుద్ధి పరిశ్రమలకు అద్భుతమైన కేంద్రాన్ని బెల్లంపల్లి పట్టణంలో 350 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మొట్టమొదటి దశలోనే 27 కంపెనీలకు ఆ స్థలాన్ని కేటాయిస్తూ, రూ.20 కోట్లతో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు తనతో భూమిపూజ చేయించారన్నారు. ఈ 27 కంపెనీల ద్వారా బెల్లంపల్లిలోని తమ్ముళ్లకు, చెల్లెళ్లకు ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ను బెల్లంపల్లికి తీసుకురావడంలో చిన్నయ్య కృషి చాలా ఉందన్నారు.
ఒకటి కాదు రెండు కాదు ఇవాళ బెల్లంపల్లిలో ఏడు వేల పట్టాలు ఇచ్చుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో 3 వేలు ఎస్ఆర్టీ క్వార్టర్లు, మిగతా 4 వేల పట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. రేపటి నుంచి మీ ఎమ్మెల్యే, కౌన్సిలర్లు స్వయంగా మీ ఇంటికే వచ్చి ఏడు వేల పట్టాలు మీ చేతిలో పెడుతారన్నారు. బెల్లంపల్లిలో ఈ రోజు గజం ధర ఎంత ఉందో నా కంటే మీకు బాగా తెలుసన్న మంత్రి, రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల విలువ చేసే ఒక్కో పట్టాను లబ్ధిదారులకు అందించుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురించి ఒక్క మాట చెప్పాలని.. సరిగ్గా మూడేండ్ల క్రితం ఈ పట్టాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, ఎస్ఆర్టీ క్వార్టర్లు ఎట్లా ఇస్తాం.. ఆ భూములు, ఈ భూములు ఎలా ఇస్తామని అధికారులు కొర్రీలు పెట్టారన్నారు. కానీ.. పట్టువదలని విక్రమార్కుడిలా దుర్గం చిన్నయ్య సీఎం కేసీఆర్‌ను సార్ ఇది కచ్చితంగా చేయాలే అని వెంట పడ్డారన్నారు. బెల్లంపల్లిలో మా వాళ్లు అడిగేది రెండేనని.. ఒకటి పట్టాలు, రెండోది మంచినీళ్లు. మీ దయతో మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్లు అందుతున్నయ్. పట్టాలు కూడా ఇస్తే పేదవాళ్లకు మేలు జరుగుతుందని గట్టిగా కృషి చేశారని చెప్పారు. ఇది చిన్నపని కాదన్నారు. మనిషి పేరు చిన్నయ్య కానీ.. చేసేటివన్నీ పెద్ద పనులే ఉంటాయని పేర్కొన్నారు. అంత గట్టి పని చేస్తున్నడు కాబట్టే ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క బెల్లంపల్లి పట్టణంలోనే ఏడు వేల పట్టాలు అందజేయగలుగుతున్నామన్నారు.
బెల్లంపల్లిలో రెండు ఐటీ కంపెనీలు నడుస్తున్నాయ్ అని చిన్నయ్య చెబితే తాను నమ్మలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే ఇక్కడ మీటింగ్‌కు వచ్చే ముందే ఆ రెండు ఐటీ కంపెనీల దగ్గరకు తీసుకుపోయారని, వాటిని చూసి నాకు ఎంతో ఆశ్చర్యం అనిపించిందని కేటీఆర్ చెప్పారు. నిజానికి ఆ కంపెనీలను చూసి తాను స్ఫూర్తి పొందానన్నారు. సనాతన ఎనలిటిక్స్ అనే కంపెనీ బెల్లంపల్లికి చెందిన ముగ్గురు పిల్లలు.. వాళ్ల నాన్న సింగరేణిలో పనిచేసి ఇక్కడే స్థిరపడ్డారు. వాళ్ల పేరు రంగనాథరాజు, శ్రీనాథరాజు, సాయినాథరాజు. ఈ ముగ్గురు యువకులు కావాలంటే ఏ అమెరికాలోనో, యూరప్‌లోనో స్థిరపడొచ్చు. మంచిగ చదువుకున్నరు. ఐటీ కొలువుల కోసం లక్షల మంది మన తెలుగు పిల్లల్లా వాళ్లు కూడా వెళ్లి ఎక్కడో స్థిరపడొచ్చు. కానీ.. అలా కాదు మేం పుట్టిన గడ్డకు ఎంతో కొంత చేయాలని ఇక్కడే ఒక కంపెనీ పెట్టి, వంద మందికి ఐటీ ఉద్యోగాలు ఇస్తున్నారంటే నిజంగా నాకు చాలా ఆనందం, ఆశ్చర్యం అనిపించిందన్నారు. అలాగే వెంకటరమణ అనే టెక్నోక్రాట్ నిర్వహిస్తున్న వ్యాల్యూ పిచ్ అనే మరొక కంపెనీ ఉందని, ఆయన స్వయంగా టెక్నాలజీ చదువుకోకపోయినా ఇతరులకు స్ఫూర్తి ఇచ్చే విధంగా 200 మందికి మీ బెల్లంపల్లి బిడ్డలకే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అది చూసి చాలా సంతోషం అనిపించిందని, చాలా నమ్మకం కూడా కలిగిందన్నారు. టెక్నాలజీ ద్వారా భవిష్యత్‌లో ప్రపంచమే కుగ్రామంగా మారిపోతున్న రోజుల్లో మరిన్ని ఐటీ కంపెనీలు తప్పకుండా బెల్లంపల్లికి వస్తాయనే విశ్వాసం ఈ రెండు కంపెనీలను చూసిన తరువాత కలిగిందన్నారు. రానున్న రోజుల్లో ఆ దిశగా తప్పకుండా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం ద్వారా ఇక్కడి పిల్లల్లో ఉన్న నైపుణ్యానికి మెరుగులు అద్ది, వాళ్లను ప్రపంచంతో పోటీ పడేలా తయారు చేసి బెల్లంపల్లి యువతకు మరిన్ని కొలువులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వమని, మీరు దయతలిస్తే, మీరు ఆశీర్వదిస్తే.. రెండు సార్లు కేసీఆర్ నాయకత్వంలో మీ కోసం పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మీ శ్రమ విలువ తెలిసిన ప్రభుత్వం కాబట్టే, ముఖ్యంగా రైతుల మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం కాబట్టే.. భారతదేశంలో 75 ఏండ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఆలోచించని విధంగా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు. ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గంలో వేలాది మంది రైతుల కుటుంబాలకు పెద్దన్నలా, పెద్దదిక్కులా, కుటుంబంలో ఒక సభ్యుడిలా మారి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు లాంటి అద్భుత కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు. ఇప్పటికే పది విడుతల్లో బెల్లంపల్లి నియోజకవర్గంలోని 47 వేల మంది రైతన్నలకు రూ.650 కోట్లు ఇచ్చామన్నారు. యాసంగి, వానకాలం నాట్ల టైం వచ్చిందంటే చాలు మీ ఫోన్లు అన్ని టింగ్.. టింగ్ అని మోగుడు.. డైరెక్ట్‌గా పైసలు పడుడు.. మధ్యవర్తులు, బ్రోకర్లు ఎవరూ లేరన్నారు. హైదరాబాద్‌లో కేసీఆర్ పైసలు వేస్తే డైరెక్ట్‌గా మీ అకౌంట్లలో పడుతున్న మాట వాస్తవమా కాదా.. ఆలోచించాలన్నారు. అలాగే నియోజకవర్గంలోని వృద్ధులు, దివ్యాంగులకు ప్రతినెలా 27,500 మందికి రూ.2వేలు, రూ.3వేల చొప్పున పింఛన్లు అందుతున్న మాట వాస్తవమా కదా.. రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది ఆడబిడ్డలకు ఒక మేనమామలా కేసీఆర్ రూ.1,00,116 ఇచ్చి, పేదింటి ఆడబిడ్డ పెళ్లిని పప్పన్నంతోనైనా గౌరవంగా చేసుకునేలా చేస్తున్నారన్నారు. ఒక్క మన బెల్లంపల్లి నియోజకవర్గంలోనే ఏడు వేల మంది ఆడపిల్లలకు షాదీముబారక్, కల్యాణ లక్ష్మి ద్వారా డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమా.. కాదా.. గమనించాలన్నారు. అలాగే 50 మంది రైతులు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డున పడకుండా.. ఆ కుటుంబంలో ధీమా నింపి.. ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షలు అందిన విషయాన్ని గుర్తించాలన్నారు.
దళితబంధు మొదటి దశలో నియోజకవర్గంలో100 మందికి ఇచ్చామని, ఇప్పుడు మరో 1,100 మందికి రాబోతుందన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో దళితబంధు తీసుకోబోతున్నవారు ఎవరైతే ఉన్నారో.. వారందరికీ ఒకటే చెబుతున్నా.. రూపాయి లంచం ఎవరికీ ఇచ్చే అవసరం లేదు. ప్రభుత్వం రూ.10 లక్షలు ఇచ్చేది సంపద పునరుత్పత్తి చేయాలనే లక్ష్యంతోనే.. దళితులు ధనికులు కావాలనే ఉద్దేశంతో తప్పా మరొకటి కాదన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని దళితులు బ్రహ్మాండంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే మీ నియోజకవర్గంలో మిషన్ కాకతీయ కింద 182 చెరువులు బాగు చేసుకున్నామన్నారు. రూ.17 కోట్లతో 100 పడకల దవాఖాన కట్టుకున్నామన్నారు. బెల్లంపల్లి పట్టణంలో మంచినీళ్ల గోస తెలంగాణ వచ్చాకే తీరిందన్నారు. రూ.44 కోట్లతో చేసిన పనులతో ఎర్రటి ఎండలోనూ మా ఆడబిడ్డలకు కష్టం కాకుండా తాగునీరు ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విజ్ఞప్తి మేరకు మరో రూ.50 కోట్లు వెంటనే మిషన్ భగీరథ, టీయూఎఫ్ఐటీ నిధులు విడుదల చేస్తామన్నారు.
ఎట్లుండే సింగరేణి.. ఎైట్లెంది ఒక్కసారి ఆలోచించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆ నాడు కేసీఆర్‌తో భుజం భుజం కలిపి.. ఉద్యమంలో అగ్గి పుట్టించిన అన్నలు.. మా నల్ల సూరీళ్లు.. మా సింగరేణి కార్మికులు అన్నారు. అందుకే మీ రుణం తీర్చుకోడానికి తెలంగాణ కొంగు బంగారమైనా సింగరేణిని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో విస్తరించుకుంటూ వెళ్తున్నామన్నారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం దశాబ్దాల పోరాటాలు చేస్తే కేసీఆర్ నాయకత్వంలో 15 వేల మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగం చేస్తున్నారన్నారు. అలాగే 4,702 కొత్త ఉద్యోగాలు ఇచ్చి మొత్తం 19,260 కొలువులను భర్తీ చేసుకున్నామన్నారు. గత ప్రభుత్వం 540 కార్మికులను కర్కశంగా డిస్మిస్ చేస్తే వాళ్లకు తిరిగి కొలువుల్లో పెట్టుకున్నామన్నారు. అలాగే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంచుకున్నామని, లాభాల్లో బోనస్‌ను 18 శాతం నుంచి 30 శాతానికి పెంచుకున్నామని, సింగరేణి ఉద్యోగులకు ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తున్నామన్నారు. ఇలా చెప్పాలంటే సింగరేణికి చేసేది చాలా ఉందన్నారు. తొమ్మిదేండ్లలో ఏం చేసింది కేసీఆర్ ప్రభుత్వం పేదవాడికి అని గంటసేపు చెప్పేదమ్ము మాకు ఉందన్నారు. ఒక కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, ఆరోగ్యలక్ష్మి, ఆరోగ్యమిత్ర, చేనేత మిత్ర, నేతన్నకు చేయూత ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ నాయకత్వంలో పేదల సంక్షేమానికి వందల కార్యక్రమాలు చేసుకుంటున్నామని, రైతులకు 24 గంటల కరెంట్ అందించుకుంటున్నామన్నారు.
ఎన్నికలు రాగానే వాడొకడు, వీడొకడు బుట్టాచోర్ గాళ్లు మొదలై నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఆగం కావొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. మరీ దిగజారిన వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తరని, సీదా యుద్ధంలో గెలిచే దమ్ములేక శిఖండి రాజకీయాలు చేస్తారన్నారు. ఇష్టం వచ్చిన ఆరోపణలు, బద్నాం చేసే పనులు చూసి మంచి నాయకులను పోగొట్టుకోవొద్దన్నారు. వాడొకడు, వీడొకడు ఎవడో గొట్టం గాడు చెబితే నమ్మి అనవసరంగా ఆగం కావొద్దన్నారు. మంచి నాయకుడు, మంచి నాయకత్వం ఉన్నప్పుడు వొదులుకోవద్దన్నారు. మంచి నాయకులున్న దగ్గర వారికి కాపాడుకోవాలని, మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. మీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంచి మనిషి అని, చక్కగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ఆయన అడిగే పనులన్నీ చేసే బాధ్యత మాదని, రోడ్లు కావాలి.. ఇంజినీరింగ్ కాలేజీ కావాలి అని అడిగారని, మళ్లీ మీరు తిరిగి మూడోసారి కేసీఆర్ గవర్నమెంట్‌ను తీసుకొస్తే తప్పకుండా బెల్లంపల్లికి అడిగినవన్ని చేసుకుందామని హామీ ఇచ్చారు. అటవీ, పర్యావరణ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ వెంకటేశ్ నేతకాని, విప్, మం చిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కోనే రు కోనప్ప, రేఖానాయక్, ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావ్, దివాకర్‌రావు, జడ్పీ చైర్మన్లు భాగ్యలక్ష్మి, కోవ లక్ష్మి, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎ మ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీశ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, పార్టీ సీనియర్ నాయకులు అరిగెల నాగేశ్వర్రావు, భోజిరెడ్డి పాల్గొన్నారు.
ఈ రోజు ఆహార శుద్ధి కేంద్రం పెడుతున్నమో అక్కడే రూ.2.40 కోట్లతో పోలంపల్లి నుంచి శికినం రోడ్డు, రూ.2.54 కోట్లతో యేసాయపల్లి నుంచి లింగాల వరకు, వేమనపల్లి మండలంలో రూ.16.57 కోట్లతో లక్ష్మిపూర్ నుంచి బద్దంపల్లికి రోడ్డు, రెండు బ్రిడ్జిల నిర్మాణానికి, పెద్దదుబ్బ నుంచి చాట్లాపూర్ మైదానం వరకు రూ.2.88 కోట్లతో రోడ్డు, దమ్మిరెడ్డిపేట నుంచి నెన్నెల వరకు రూ.3.34 కోట్లతో రోడ్డు, రూ.3.29 కోట్లతో చాకేపల్లి, తాండూర్ మండలం కాసిపేట గ్రామం వరకు.. రూ.2 కోట్లతో బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర నిర్మించిన ఎస్సీ, ఎస్టీ హాస్టల్ బిల్డింగ్‌కు, రూ.5.50 కోట్లతో మండల, గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణానికి, బెల్లంపల్లి నుంచి వెంకటాపూర్‌కు పోయే రోడ్డును బాగు చేసుకునేందుకు రూ.5.65 కోట్లతో చేసే పనులకు, మిషన్ భగీరథలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని ప్రతి ఇంటికి నీరిచ్చే విధంగా రూ.44 కోట్లతో మిషన్ భగీరథ పంప్‌హౌజ్, వాటర్ ట్యాంక్‌లు ప్రారంభించుకున్నాం. అలాగే రైతుబజార్, మార్కెట్ రోడ్డు విస్తరణ, శిశు మందిర్ రోడ్డు విస్తరణ, మోరీల కోసం, పాలిటెక్నిక్ కాలేజీ నుంచి రవీంద్రనగర్ పోయేందుకు సీసీ రోడ్ల కోసం రూ.6.72 కోట్లతో శంకుస్థాపనలు చేసుకున్నాం. మొత్తం కలిపితే ఈ ఒక్క రోజులో రూ.114.89 కోట్ల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం.
బెల్లంపల్లి, మే 8 : సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీతో దశాబ్దాల కల నెరవేరిందని, దీని వెనుక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కృషి ఎంతో ఉందని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు పదే పదే సమస్యను వివరించి చివరకు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారని కొనియాడారు. మొత్తం ఏడు వేల మందికి పట్టాలు పంపిణీ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రతి లబ్ధిదారుడు రూ.15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు యాజమాన్యపు హక్కు పొందినట్లయ్యిందని చెప్పుకొచ్చారు. బెల్లంపల్లిలో రెండే రెండు పెద్ద సమస్యలుంటే.. అందులో ఒకటి పట్టాల పంపిణీ, మరొకటి మిషన్ భగీరథ నీరు అని, ఆ రెండు సమస్యలకూ పరిష్కారం దొరికిందన్నారు.
పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించిన ఘనత మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని ఎంపీ వెంకటేశ్ నేతకాని కొనియాడారు. తెలంగాణకు ఐదు ప్రైవేట్ కంపెనీలను తీసుకువచ్చి మూడు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారని చెప్పుకొచ్చారు. తెంగాణ ముఖ చిత్రాన్ని ప్రపంచానికి చాటిన నేత కేటీఆర్ అని, 2014 కంటే ముందు తెలంగాణలో ప్రజల జీవన విధానం ఎలా ఉండేదో ప్రజలు గ్రహించాలని కోరారు.
గత ప్రభుత్వాలు బెల్లంపల్లి అభివృద్ధికి చేసిందేమీ లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదని కొనియాడారు. బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌గా మారడం, సింగరేణి ప్రాంతంగా అభివృద్ధి చెందడంతోనే సరైన గుర్తింపు లభించిందన్నారు.
మంత్రి కేటీఆర్ పేరు చెప్తే ప్రతిపక్షాలకు భయమని, వారి గుండెల్లో రైలు పరిగెడుతాయని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల కోసం ఎంత దూరమైనా పరుగులు పెట్టే నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ, మిషన్ భగీరథ తాగునీటి సరఫరాతో ఈ ప్రాంత ప్రజల కల నెరవేరిందన్నారు. రూ.44 కోట్లతో మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రూ.7వేల కోట్లతో బెల్లంపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పథకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రూ.3.96 కోట్లతో 18 రైతు వేదిక భవనాలు నిర్మించినట్లు చెప్పా రు. రూ.14 కోట్లతో 1082 చెరువులు నిర్మించామన్నారు. కల్యాణ లక్ష్మికి రూ.59 కోట్లు వెచ్చించిన ట్లు తెలిపారు. రూ.390 కోట్లతో 39 వంతెనలు నిర్మించినట్లు వివరించారు. రూ.190 కోట్లతో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. రూ.17 కోట్లతో 100 పడకల దవాఖాన నిర్మించినట్లు చెప్పుకొచ్చారు. మరో మూడు కోట్ల నిధులను దవాఖాన అభివృద్ధికి కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. బెల్లంపల్లికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై నీచమైన ఆరోపణలకు దిగుతున్నాయని, ప్రజలు గమనించాలని కోరారు.
మంత్రి కేటీఆర్ సభకు బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ, బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి మండలాల నుంచి బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలపై ర్యాలీగా చేరుకున్నారు. శాంతిఖని గనికి చెందిన కార్మికులు సింగరేణి టోపీలు ధరించి సభకు హాజరయ్యారు. రెండు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డీసీసీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.