కుభీర్ : రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో మండలంలో అరైవ్- అలైవ్ కార్యక్రమం కొనసాగుతోందని ఎస్సై శ్రీనివాస్ ( SI Srinivas ) తెలిపారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (కె), తదితర గ్రామాల్లో వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాల ( Road Safety Rules) పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వాడడం మానేయాలన్నారు.
టీనేజ్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, 18 సంవత్సరాల నిండని వారు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రతను పెంచడం , చట్టాన్ని గౌరవించే వాతావరణాన్ని కల్పించడం పోలీసుల ముఖ్య ఉద్దేశమని అన్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బందెల గంగమణి సత్యనారాయణ, ఉప సర్పంచ్ నాయుడు పోశెట్టి, మాజీ వైస్ ఎంపీపీ బి. శంకర్, వీడీసీ అధ్యక్షుడు దుంపేటి రాములు, గోజల గజ్జరాం, పోలీసు సిబ్బంది, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.