ఆదిలాబాద్, మే 4(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ప్రహసనంగా మారింది. ఎన్నికల సమయంలో రైతులకు పెట్టుబడి కోసం ఇబ్బందులు లేకుండా రైతు భరోసా కల్పిస్తామని, ఎకరాకి రూ.7,500 ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఎన్నికల హామీని విస్మరించి ఎకరానికి రూ.6 వేలు ఇస్తామని ప్రకటించినా పంపిణీని అర్ధాంతరంగా నిలిపివేసింది. జిల్లాలో రైతుల వానకాలం పనులు ప్రారంభించినా పెట్టుబడికి అప్పులు చేయాల్సి వస్తుంది. యాసంగికి కేవలం నాలుగెకరాల వరకు డబ్బులను పంపిణీ చేసిన ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా డబ్బులు అన్నదాతలకు అందకపోగా, వానకాలం పంటకు సర్కారు అందించే పెట్టుబడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
యాసంగి సీజన్ ముగిసినా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ కాలేదు. కేవలం నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే పైసలు రాగా.. మిగతా వారు తమకు ప్రభుత్వ పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందో అని ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసింది. రైతులకు సీజన్‌కు ముందుగానే ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు రూ.10వేల పంట పెట్టుబడి సాయాన్ని అందజేసింది. దీంతో రైతులు రెండు సీజన్లలో తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఇబ్బందులు లేకుండా సాగు చేసి లాభాలు పొందారు.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,63,359 మంది రైతులు ఉన్నారు. ఏటా వానకాలంలో 5.40 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారు. పత్తి, సోయాబిన్, కంది పంటలను ఎక్కువగా పండిస్తారు. రైతు భరోసా రాకపోవడంతో రైతులు సాగులో భాగంగా పెట్టుబడి కోసం బ్యాంకులు, ప్రైవేటుగా అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ పెద్దల ప్రకటనల మేరకు రైతు భరోసా వస్తుందనే నమ్మకంతో అప్పులు తీసుకొచ్చి సాగు చేశామని, సీజన్ ముగియడంతో అప్పులు ఇచ్చిన వారు తమ పైసలు వడ్డీ ఇవ్వాలని అడుగుతున్నారని రైతులు అంటున్నారు. జొన్న పంట కొనుగోళ్లు లేక, రైతు భరోసా రాక అప్పులు ఎలా కట్టాలో తెలియడం లేదంటున్నారు. ప్రభుత్వం అందరూ రైతులకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాలని కోరుతున్నారు.
మాకు కజ్జర్ల శివారులో 4.36 ఎకరాల భూమి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు పథకంతో రైతులకు మేలు జరిగింది. సీజన్‌కు ముందుగానే డబ్బులు రైతుల ఖాతాల్లో పడేవి. దీంతో రైతులు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు సాగు కోసం అప్పులు చేయాల్సి వస్తున్నది. నేను యాసంగిలో జొన్న సాగు చేయగా.. రూ.75 వేల వరకు ఖర్చు అయింది. మా తండ్రి గణపతి పేరిట పట్టా ఉండగా ఇప్పటి వరకు యాసంగి రైతు భరోసా రాలేదు. వానకాలం సీజన్ పనులు ప్రారంభించాం. నేను పత్తి సాగు చేస్తాను. ఇందుకు ఎకరాకు కనీసం రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రైతు భరోసా ఎకరాక రూ.6 వేల వస్తుందనే నమ్మకం లేదు. దీంతో ఎక్కవ వడ్డీతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సి వస్తుంది.
– శార్థ నవీన్, కజ్జర్ల, తలమడుగు మండలం