భైంసాటౌన్, జూన్ 13 : కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ భైంసా మండలంలోని కుంసర గ్రామ రైతులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు విక్రయించి ఇరవై రోజులైనా డబ్బులు చెల్లించడం లేదని తెలిపారు. వానాకాలం ప్రారంభమైనందున విత్తనాలు, ఎరువులు ఇతర ఖర్చులకు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలో రెండు రోజుల్లోనే డబ్బులు ఖాతాల్లో జమయ్యేవని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రోజులైనా డబ్బులు జమ చేయడం లేదన్నారు. సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించినా ఇప్పటివరకు తమకు ఓటీపీ రాలేదని, ఆధార్ కార్డు జిరాక్స్ అడగడం లేదని ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో ఇంకా 100 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనాల్సి ఉన్నా ఇప్పటివరకూ లారీలు పంపించడం లేదన్నారు. ఈ నిరసనలో మాజీ సర్పంచ్ ప్రవీణ్, రైతులు సొలంకి రవికాంత్, సూర్యవంశీ రవికాంత్, శంకర్, గైక్వాడ్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
నాకు ఓటీపీ వచ్చి 12 రోజులైంది. కానీ ఇప్పటికీ నా ఖాతాలో పైసలు జమ కాలేదు. యాసంగిలో పండించిన వడ్ల పైసలు వస్తేనే నేను వ్యవసాయం చేయగల్గుతాను. పైసలు తొందరగా వస్తాయనుకొని క్వింటాలుకు 5 కిలోల చొప్పున తరుగు తీసినా ఒప్పుకున్నా. ఇప్పటికీ గ్రామంలో 100 క్వింటాళ్లకు పైగా వడ్ల కుప్పలు రోడ్లపైనే ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు మా ఊరి వాళ్లు 200ల క్వింటాళ్ల వరకు నష్టపోయినం. మిగిలిన వడ్లను కొని, మా బాధను అర్థం చేసుకుని ఇప్పటికైనా పైసలు జమ చేస్తే బాగుంటది.
-రవికాంత్, రైతు, కుంసర
తడిసిన ధాన్యాన్ని, మిగిలిపోయిన ధాన్యాన్ని ఒక లారీ తీసుకొచ్చి తీసుకెళ్తాం అన్నారు. నేను రోడ్డుపై ధాన్యం ఆరబోసి 20 రోజులకు పైగా అయింది. లారీ రాలేదు వడ్లు కొనలేదు. రోజు వడ్లకు కాపలాతోనే దినం గడిచి పోతున్నది. వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికైనా మా రైతుల బాధలు అర్థం చేసుకుని ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నాం.
-గాయక్వాడ్ గౌతమ్, రైతు, కుంసర
మా ఊరికి వచ్చే రోడ్డుపై చూస్తే అక్కడక్కడా ధాన్యం కుప్పలు ఇంకా కనిపిస్తున్నాయి. మిగిలిన వడ్ల కోసం లారీ పంపిస్తామన్నారు. ఇప్పటివరకు లారీ రాలేదు. ఎండిన ధాన్యాన్ని అమ్మి ఇరవై రోజులైంది. ఇప్పటికీ పైసలు జమ కాలేదు. పైసలు లేక వానాకాలం పంట కోసం విత్తనాలు, ఎరువుల కొనుడు ఎట్లనో అర్థమైతలేదు. పంట పెట్టుబడి కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తున్నది.
-శంకర్, రైతు, కుంసర