ఆదిలాబాద్, మే 16 : రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంలో జాప్యం చేయడంతో ఆదర్శ గ్రామం ముఖ్రా (కె) సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఆమె భర్త సుభాష్ దినసరి కూలీలుగా మారారు. ముఖ్రా (కె) గ్రామంలో NREGAలో భాగంగా మీనాక్షి, సుభాష్ దంపతులు రోజువారి కూలీలో భాగంగా భూమిని తవ్వే పనికి వెళ్తున్నారు. ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి బిల్లుల చెల్లింపులో విపరీతమైన జాప్యం చేయడం కారణంగా తాము తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు వారు చెప్పారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులను సకాలంలో చెల్లించిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.
పెండింగ్ బిల్లులను వీలైనంత త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా గ్రామీణ పౌర సంస్థల ప్రజా ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వారికి వేరే మార్గం లేకుండా పోవడంతో ఉపాధి పథకంపై ఆధారపడుతున్నట్లు తెలిపారు.
వివిధ అంశాలలో రాణించినందుకు ముఖ్రా (కె) గ్రామానికి ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. 2023లో కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి గిరి రాజ్ సింగ్ నుండి జాతీయ స్థాయి గ్రామ ఉర్జా స్వరాజ్ విశేష్ అవార్డు అలాగే రూ.50 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందుకుంది. వివిధ పథకాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు మోడల్ విలేజ్ 2023లో స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్, 2022లో జీవ వైవిధ్య అవార్డు, 2020లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును గెలుచుకుంది. 2024 మార్చి 31న హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ పంచాయతీ అవార్డుల వేడుక 2021-22లో కూడా ఈ గ్రామం మూడు అవార్డులను గెలుచుకుంది.