కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో బాధితులుగా మిగిలిపోయిన వారి గోడు విని, వారికి భరోసానిచ్చేందుకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల జైనూర్‌కు చెందిన ఆటోడ్రైవర్ మక్దుం.. దేవునిగూడకు చెందిన మెస్రం నీలాబాయిపై హత్యాయత్నం చేయగా, దవాఖానలో చేర్చడంతో ఆమె ప్రాణాపాయస్థితి నుంచి బయటపడిన విషయం విదితమే.
ఆమెను ఎమ్మెల్సీ కవిత పరామర్శించనున్నారు. ఆపై జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన, ఆశ్రమ పాఠశాలను సందర్శిస్తారు. అలాగే వాంకిడి ఆశ్రమ పాఠశాలలో విషాహారం తిని మృత్యువాత పడిన శైలజ కుటుంబాన్ని కూడా ఆమె పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు. అనంతరం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఇంటికి చేరుకొని లంచ్ చేయనున్నారు. చివరగా గోలేటిలో సింగరేణి కార్మికులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు.
భారీ బైక్‌ర్యాలీలతో స్వాగతం
ఎమ్మెల్సీ కవిత పర్యటనను విజయవంతం చేసేందు కు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీ ఏర్పా ట్లు చేస్తున్నారు. ఉట్నూర్ మండలంలోని నార్నూర్ ఎక్స్‌రోడ్ నుంచి రెబ్బెన మండలం గోలేటి వరకు భారీ బైక్ ర్యాలీ తీసి..ఘన స్వాగతం పలకనున్నారు. అలాగే ఆసిఫాబాద్, జైనూర్, కెరమెరి, వాంకిడి మండల కేంద్రాల్లోనూ బైక్ ర్యాలీలు తీయనున్నారు.