మంచిర్యాల, జనవరి 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపించేదంతా కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే.. రేవంత్‌రెడ్డి సర్కారు ఇప్పటివరకు తట్ట మట్టి తీసింది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. తన పర్యటన సందర్భంగా అనేక గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలన్నీ ఎండిపోయి కనిపించాయన్నారు. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సోమవారం పర్యటించిన కవిత ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసంలో సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఏర్పాటు చేసిన గురుకులాల్లో చదువుకున్న పిల్లలు ఐఐటీల్లో ర్యాంకులు సాధించారని, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, గ్రూప్స్ సాధించారన్నారు.
కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ రోజు గురుకులాల్లో ఆ పరిస్థితి లేదన్నారు. పిల్లలకు పాములు, తేల్లు కుట్టడం, విషాహారంతో ప్రాణాలు పోగొట్టుకునే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. తెలంగాణలో ఆడబిడ్డలకు కేసీఆర్ సర్కారు కల్పించిన భద్రతను కాంగ్రెస్ సర్కారు కల్పించడంలో విఫలమైందన్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని, రూ.12 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదన్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్ష తీసుకునే ధోరణిలో అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా మొక్కవోని ధైర్యంతో ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని, ప్రజలకు రావాల్సిన హక్కులపై వారిని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
4.50 లక్షల ఎకరాలకు పట్టాలిచ్చాం..
భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన ఆదివాసీ యోధులను స్మరించుకుంటూ ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తే నరనరా ల్లో ఉత్తేజం నిండిపోయిందని ఎమ్మెల్సీ కవిత అన్నా రు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చామన్నారు. భూమి కోసం పోరాటం చేసిన గిరిజన, ఆదివాసులకు భూములపై హక్కులు ఉండాలనే ఉద్దేశంతో గత ము ఖ్యమంత్రి కేసీఆర్ 4.50 లక్షల ఎకరాల పైచిలుకు భూ ములను 2.50 లక్షల మందికి పట్టాలిచ్చారన్నారు. బీ ఆర్ఎస్, కేసీఆర్ పదేళ్ల పాలనలో భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిన వీరులందరినీ స్మరించుకుందన్నారు. కానీ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆదివాసులపై శీ తకన్ను వేస్తున్నదన్నారు. ఆనాడు మా హయాంలో అ టవీ భూములపై హక్కులు ఇచ్చామని, ఆ వెంటనే రై తుబంధు వేశామన్నారు. ఇప్పుడున్న రేవంత్‌రెడ్డి సర్కా రు కూడా ఆదివాసీ, గిరిజనులకు ఆదుకోవడానికి అదేస్థాయిలో ముందుకు రావాలన్నారు.
తెలంగాణ ఉద్య మ సమయంలో కేసీఆర్ అనేక సార్లు రాష్ట్రం ఏర్పడ్డాక చిన్న జిల్లాలు చేసుకుంటామని చెప్పారన్నారు. చె ప్పినట్లుగానే తెలంగాణ ఏర్పడ్డాక ఆసిఫాబాద్ జిల్లా కేంద్రమైందని, అన్ని రకాల అభివృద్ధి పనులు కలెక్టరే ట్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజీలతో ప్రజలకు పరిపాలన, ప్రభుత్వ సేవలు చేరువలోకి వచ్చాయన్నారు. అంతకుముందు బెజ్జూర్, కౌటాల, జైనూర్, కెరిమెరి వంటి మండలాల నుంచి ఆదిలాబాద్‌కు పోయిరావాలంటే మూడు రోజుల సమయం పడుతుండేదన్నారు. కలెక్టర్తోని పని చేసుకోవాలంటే అనేక వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేదన్నారు. కేసీఆర్ వచ్చాక ఆ దుస్థితిపో యి ప్రజలకు అందుబాటులోకి పాలన తీసుకొచ్చారన్నారు. దూరదృష్టితో గిరిజన, ఆదివాసులు బాగుండాలనే ఉద్దేశంతో ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. వెనుకబడిన జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, ఏకలవ్య స్కూల్స్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారన్నారు. ఎస్టీ గురుకులాల్లో ఆడపిల్లల కోసం డిగ్రీ కాలేజీలను పెట్టిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. అడవి బిడ్డల కోసం ప్రేమతో పని చేశారన్నది జిల్లా ప్రజలందరి దృష్టిలో ఉందన్నారు.
టీబీజీకేఎస్‌కు పూర్వ వైభవం
సింగరేణిలో టీబీజీకేఎస్‌కు పూర్వవైభవం వస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆసిఫాబాద్ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి గోలేటిలో నిర్వహించిన కార్మికుల సమావేశంలో కవిత మాట్లాడారు. తెలంగాణ అంటేనే సింగరేణి అన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కారుణ్య నియామకాలను పునరుద్ధరించారన్నారు. ప్రైవేటీకరణ కోసం కేంద్ర ఎంత ఒత్తిడి చేసినా మనం చేయలేదన్నారు. సింగరేణి కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ జనాలను ఎలా మోసం చేసిందో సింగరేణి కార్మికులను అధికార పార్టీ కార్మిక సంఘాలు అంతకంటే అద్భుతంగా మోసం చేశాయన్నారు. లాభాల్లో వాటా ప్రకటించి కేసీఆర్ కంటే ఒక శాతం ఎక్కువ ఇచ్చామని ఊదరగొట్టారన్నారు. వాస్తవానికి 50 శాతం కోత పెట్టి కార్మికుల పొట్ట కొట్టారన్నారు.
గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ ఏం మాట్లాడకుండా వాళ్లు బిచ్చం వేస్తే మనం తీసుకుందాం అన్నట్లుగా ఉన్నారు తప్పితే ఏం చేయలేదన్నారు. లాభాలు రూ.4,500 కోట్లు వచ్చినయంటే అందులో మీ అందరి చమట చుక్కలు ఉన్నాయన్నారు. మీ కష్టంతో వచ్చిన లాభాలను మీకు పంచడానికి వీళ్లకు ఏం నొప్పో నాకు అర్థం కాలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో 38 శాతం ఇచ్చామన్నారు. కార్మికుల పక్షాన గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. మన టీబీజీకేఎస్ ఒక అడుగు వెనక్కి వేసినట్లు కనిపిస్తున్నా.. పులి ఒక అడుగు వెనక్కి వేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఒక అడుగు వెనక్కి వేసింది ఆలోచన కోసమేనని, టీబీజీకేఎస్‌కు తప్పకుండా పూర్వవైభవం వస్తుందన్నారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసుకుంటామన్నారు. కార్మికుల పక్షాన నిరంతరాయంగా, అలుపులేకుండా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
బాధితులకు భరోసా..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు, మహిళలు, బహుజనులు, దళితులు, గిరిజనులు, ఆదివాసీ వర్గాలన్నింటికీ అన్యాయం జరుగుతుందన్నారు. జైనూర్ ఘటనలో బాధితురాలైన ఆదివాసీ మహిళ మొస్రం నీలాబాయి, ఆశ్రమ పాఠశాలలో విషాహారం తిని మృతి చెందిన శైలజ ఘటనల్లో రేవంత్ సర్కారు మొద్దునిద్ర పోయిందన్నారు. సున్నితమైన విషయాల్లో స్పందించడం, బాధితులకు భరోసా కల్పించడంలో విఫలమైందన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జైనూర్ ఘటనలో బాధితురాలైన నీలాబాయి కుటుంబాన్ని పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరు, ప్రభుత్వ సహాయ సహకారాలపై ఆరా తీశారు. నీలాబాయి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. జైనూర్ ఘటనలో దుకాణాలు కాలిపోయి నష్టపోయిన వివిధ వర్గాల ప్రజలందరికీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి ప్రమాదంలో గాయపడి నాలుగేళ్లుగా ఇబ్బందులు పుడుతున్న మాజీ ఎంపీటీసీ జామ్ని, తెలంగాణ ఉద్యమకారుడు లట్పటే మాధవ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం కెరిమెరి మీదుగా వాంకిడి మండలంలోని దాబా గ్రామానికి బయల్దేరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో విషాహారం తిని మృతి చెందిన శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న క్రమంలో వాంకిడి సమీపంలో కవిత కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నది. శైలజ చదువుకున్న ఆశ్రమ పాఠశాల ముందు నుంచి కాన్వాయ్ వెళ్లడానికి అనుమతి నిరాకరించిన పోలీసులు, వేరే మార్గంలో దాబా గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ శైలజ కుటుంబ సభ్యులను పరామర్శించిన కవిత రూ.2 లక్షల చెక్కును అందజేశారు.
గతంలో నిమ్స్ ఆసుపత్రిలో శైలజ చికిత్స పొందుతున్న సమయంలోనూ ఎమ్మెల్సీ కవిత వెళ్లి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శైలజ మృతి వార్తతో చలించిపోయిన ఆమె రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆ చెక్కును సోమవారం స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి అందజేశారు. శైలజ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. రోజంతా ఆదివాసులతో మమేకమై ఆడిపాడడం, వారి కష్టాలు పంచుకోవడం, వారితో గడపడం సంతోషంగా ఉందన్నారు. ఆదివాసుల సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందన్నారు. దండారీ సమయంలో కేసీఆర్ ఆదివాసీ గూడేలకు రూ.10వేలు ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తు చేసుకుంటున్నారన్నారు. గిరిజన, ఆదివాసులపై ప్రేమతో సంస్కృతిని కాపాడుకున్నామని, ప్రేమతో మతపరమైన గొడవలు కాకుండా చూసుకున్నామన్నారు. కానీ.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక అనేక ఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రశాంతమైన అందరు కలిసిమెలిసి బతికే వాతావరణం కల్పించాలని కోరుతున్నామన్నారు.
బైక్ ర్యాలీలు.. ఘన స్వాగతాలు..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జి ల్లాల్లో ఎమ్మెల్సీ కవిత పర్యట న సందర్భంగా అడుగడునా బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం నస్పూర్ క్రాస్ రోడ్డు దగ్గరకు చేరుకున్న కవితకు కార్యకర్తలు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. జైనూర్, కెరిమెరి, ఆసిఫాబాద్‌లోనూ స్వాగతం పలికారు. అనుమతులు ఉన్న మేరకు బైక్ ర్యాలీలు తీశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోగానే పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, కరీంనగర్ మాజీ మేయర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్, టీబీజీకేఎస్ నాయకులు రాజిరెడ్డి పాల్గొన్నారు.