మంచిర్యాల, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో మంత్రి పదవి ‘కాక’ రేపుతున్నది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా వెడ్మ బొజ్జు పేరును పరిశీలిస్తున్న విషయం బయటికి వచ్చింది. దీంతో తూర్పు జిల్లాగా పేరొందిన మంచిర్యాల ప్రాంతానికి చెందిన నాయకులకు కాకుండా, ఈసారి కూడా పశ్చిమ జిల్లా వాసులకే మంత్రి పదవి ఇస్తారనే చర్చ సాగింది. ఈ సర్కారు హయాంలో మా లీడర్‌కు మంత్రి పదవి వస్తుందంటూ ఆదివాసీలు గంపెడాశలు పెట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేల్లో ఒకరికి ఆర్టీసీ చైర్మన్, మరొకరికి ప్రభుత్వ విప్ పదవులు ఇస్తారంటూ కాంగ్రెస్ లీడర్లే చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి పదవిపై బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర మాల సంఘం అధ్యక్షుడు చేపట్టిన పాదయాత్ర మంచిర్యాల జిల్లా ఇందారం చేరుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కాక కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో మంత్రి పదవి విషయంలో ఆయన ఇంకా పట్టు విడవలేదని స్పష్టమైంది. మా సార్కే మంత్రి పదవి అంటూ చెన్నూర్ కాంగ్రెస్ లీడర్లు తెగ ప్రచారం చేస్తున్నారు. దీంతో మంత్రిపదవి అంశం ఉమ్మడి జిల్లాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్ సన్నిహితులు సైతం మా సార్‌కు మంత్రి పదవి ఇస్తారని చెప్పుకొస్తున్నారు. డిసెంబర్లో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని.. మా సార్ మంత్రి అవుతారని, అది కూడా విద్యాశాఖ మంత్రి అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ లీడర్లు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తున్నది. ఒకటి పీఎస్సార్ వర్గం, మరొకటి కాక కుటుంబ వర్గంగా ఏర్పడ్డాయనే చర్చ జోరందుకున్నది. చెన్నూర్‌లో ఎమ్మెల్యే వివేక్ అంటే గిట్టని నాయకులు పీఎస్సార్ గూటికి చేరుతున్నారు. మొన్నటికి మొన్న ఓ కేసు విషయపై చెన్నూర్ కాంగ్రెస్ లీడర్లు కొందరు పీఎస్సార్‌తో టచ్‌లోకి వెళ్లారనే గుసగుసలు వినిపించాయి. అంతకుముందే మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్ విషయాన్ని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. చెన్నూర్‌లో ఉప ముఖ్యమంత్రి టూర్ రద్దు అయిన రోజు సాయంత్రమే వివేక్ చెన్నూర్‌లో అత్యంత సన్నిహితమైన నాయకులతో సమావేశమయ్యారు.
జిల్లాలో మనం పట్టు సాధించాలంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ ఇద్దరు నాయకులు మధ్య దూరం మరింత పెరిగిందనే వాదనలకు బలం చేకూరింది. మంచిర్యాలలో ఉండి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన కొందరు కీలక నాయకులు పీఎస్సార్ దగ్గరకు వెళ్లలేక వివేక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. వారంతాల్లో వివేక్ మంచిర్యాలకు వచ్చిన ప్రతిసారి ఆ నాయకులు ఆయన్ని కలవడానికి ఇంటికి వస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య అంతర్గతంగా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం పెరిగిందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఎవరికి మంత్రి పదవి వచ్చినా మనకు మంచి జరగాలంటే ప్రస్తుతానికి అంటీ ముట్టనట్లు ఉండడమే మంచిదనే ఆలోచనలో ఉన్నారు.
మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురికి ముగ్గురు మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఎవరికి వారు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో చీమ చిటుక్కుమన్నా ఇంటెలీజెన్స్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యేలు చేసే ప్రతి పనిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు వెళ్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీన్నే సీఎంతో సాన్నిహిత్యంగా ఉండే ఓ ఎమ్మెల్యే బ్రహ్మస్త్రంగా వాడుకుంటున్నట్లు తెలిసింది. మంచిర్యాలలో ఇటీవల జరిగిన కూల్చివేతలకు ముందస్తు అనుమతులు తీసుకోకపోవడంపైనా, శాంతి భద్రతలకు కలుగుతున్న విఘాతంపైనా సదరు ఎమ్మెల్యే అధిష్టానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
అదే సమయంలో చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో పార్టీలో జరుగుతున్న గొడవలు, చిన్నచిన్న విషయాల్లో అనధికార జోక్యంపై అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. గడిచిన ఏడాది కాలంలో ఎమ్మెల్యేలు చేసిన పనుల్లోని లోపాలను ఎత్తి చూపి మంత్రి పదవికి దాన్ని లింక్ చేస్తారనే చర్చ జిల్లాలో నడుస్తున్నది. వాటి ఆధారంగా మంచిర్యాల జిల్లాలోని ఎమ్మెల్యేలకు నచ్చజెప్పి ప్రభుత్వం ఆదీవాసీ నినాదం ఎత్తుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే మంచిర్యాల ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు గల్లంతు అవ్వడం ఖాయంగా కనిపిస్తున్నది.