కాగజ్‌నగర్, మార్చి 27 : అవినీతి అక్రమాలపై మాట్లాడితే అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణమని, ఇది ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం కాగజ్‌నగర్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌లో పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై మాట్లాడిన కేటీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం సరికాదన్నారు. పదో తరగతి విద్యార్థిని బెదిరించి పేపర్ ఫొటోలు తీసి వాట్సాప్‌లో వైరల్ చేశారని, దీనికి విద్యార్థిని డిబార్ చేయడమేమిటని ప్రశ్నించారు. గిరిజనులు, దళితులను అవమానపరుస్తూ మాట్లాడిన కాంగ్రెస్, ఎంఐఎం నాయకులు, సీఎంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు.
సిర్పూర్ నియోజకవర్గంలో సరైన ప్రభుత్వ దవాఖానలు లేక.. సకాలంలో వైద్యం అందక బుధవారం కౌటాల మండలానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడని, పట్టణంలోని ఈఎస్ఐ దవాఖానలో వైద్యం అందని ద్రాక్షగా మారిందని చెప్పుకొచ్చారు. వైద్య వృత్తిలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ హరీశ్‌బాబు సైతం ప్రభుత్వ దవాఖానలను పట్టించుకోవడం లేదన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలో పాత పోలీసు స్టేషన్ స్థలంలో రెండొతస్తుల భవనం నిర్మాణం జరుగుతుంటే అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారులకు ఫిర్యాదులు అందితే తూతూమంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పోడు రైతులకు అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేయకూడదని, సిర్పూర్ నియోజకవర్గంలోని 9 లిఫ్ట్ ఇరిగేషన్లు మరమ్మతు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గం కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, మాజీ కౌన్సిలర్ మిన్హాజ్, నాయకులు రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
కౌటాల, మార్చి 27 : హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. గురువారం తాటిపల్లి గ్రామానికి చెందిన దాదాపు 20 మంది వివిధ పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని, ప్రస్తుత ప్రభుత్వ పుణ్యమాని అన్ని వర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నారని చెప్పారు. గురుడుపేట గ్రామానికి చెందిన ఎలకుచ్చుల తిరుపతి అనే యువకుడు వైద్యం వికటించి మృతి చెందగా, ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసానిచ్చారు. అనంతరం గుడ్లబోరి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్లబండ్ల పందేల పోటీలను ప్రారంభించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి లెండుగురే శ్యారావు, బీఆర్ఎస్ నాయకులు బండు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.