ఇచ్చోడ(సిరికొండ), ఏప్రిల్ 18 : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుస్థిర పాలన అందిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పల్లె ప్రగతితో పంచాయతీలకు కొత్త కళ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వర్గానికి న్యాయం చేస్తుంటే.. ఓర్వలేని విపక్షాలు మతి తప్పి మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదో తరగతి విద్యార్థుల పరీక్షా పత్రం లీక్ చేసి వారి జీవితాల తో ఆటలాడుతున్నారన్నారు. కంటి వెలుగు, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా నీటిని అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పనికి రాని పార్టీలు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు చెబుతారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేసీఆర్ సీఎం అవుతారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్లో 100 మంది చేరిక
మండలంలోని ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు, యువకులు, మహిళలు మాజీ సర్పంచ్ షేక్ బషీర్ ఆధ్వర్యంలో చేరగా.. వారికి ఎమ్మెల్యే రేఖానాయక్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సునీల్, మాజీ సర్పంచ్‌లు బిక్కు నాయక్, షేక్ బషీర్, బీఆర్ఎస్ నాయకులు విజయ్‌కుమార్, గోవర్ధన్, రైతుబంధు మండలాధ్యక్షుడు రాజారాం, సర్పంచ్ లచ్చురాం, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం..
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలుపించుకుందాం. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిస్తున్నది.
– గుండాల రాజారాం, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు.