ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/జైనథ్, జూలై 23 : మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పెన్‌గంగకు వరద ఉధృతి తగ్గింది. జైనథ్ మండలంలోని డొల్లార వద్ద ఎన్‌హెచ్-44పై గల బ్రిడ్జి ప్రమాదకర స్థితికి చేరడంతో శనివారం రాత్రి 9 గంటల నుంచి రాకపోకలను నిలిపివేశారు. పెన్‌గంగ శాంతించడంతో ఆదివారం ఉదయం 9 గంటలకు వాహనాల ప్రయాణం ప్రారంభమైంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్‌రాజ్ వంతెనను సందర్శించి అధికారులను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కాగా.. ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పెన్‌గంగ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వెంకట్రావ్‌పేట్ అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి వరద వెళ్తోంది. అధికారులు రాకపోకలు నిలిపివేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆదిలాబాద్ మీదుగా తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, ఇసాపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద ఉధృతి పెరిగింది. ఫలితంగా శనివారం పెన్‌గంగకు వరద పోటెత్తింది. భీంపూర్, జైనథ్ మండలాల్లో పెన్‌గంగ ఉధృతంగా ప్రవహించింది. జైనథ్ మండలం డొల్లార వద్ద మహారాష్ట్ర సరిహద్దు జాతీయ రహదారి 44పై గల వంతెన వద్ద ప్రమాదకర పరిస్థితుల్లో నది ప్రవాహం కొనసాగగా అధికారులు శనివారం రాత్రి నుంచి రాకపోకలు నిలిపివేశారు. రెండు రాష్ర్టాల సరిహద్దులో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎన్హెచ్ఏఐ, రెవెన్యూ, పోలీసు అధికారులు వంతెన వద్ద వరద ప్రవాహాన్ని అంచనా వేశారు. ఆదివారం ఉదయం వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఎన్హెచ్ఏఐ ఇంజినీరింగ్ విభాగం అధికారులు భారీ వరద కారణంగా వంతెనకు ఏమైనా ప్రమాదం జరిగిందా అనే విషయాలను పరిశీలించారు. ఎలాంటి అపాయం లేకపోవడంతో రాకపోకలను కొనసాగించవచ్చని నిర్ణయించారు. దీంతో దాదాపు 12 గంటలపాటు నిలిచిన రాకపోకలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. పోలీసులు, అధికారులు వంతెన వద్ద ఉండి వరద పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్‌రాజ్ వంతెనను సందర్శించి అధికారులను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట ఎన్‌హెచ్-44 పీడీ శ్రీనివాస్, పెన్‌గంగ ఈఈ రవీందర్, ఎంపీపీ గోవర్ధన్, పీఏసీఎస్ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీవో గజానన్, ఏవో వివేక్, సీఐ నరేశ్ ఉన్నారు.
పెన్‌గంగ పరీవాహక గ్రామాలైన గుబ్‌డి, గోముత్రి, అంతర్గాం, వడూర్, తాంసి(కే), గొల్లగఢ్ గ్రామాల ప్రజలు శనివారం రాత్రంతా జాగారం చేశారు. నీరు ఇండ్లలోకి చేరడంతో అధికారులు ప్రజలను బడులు, రైతువేదికలు, బంధువుల ఇళ్లలో ఆశ్ర యం కల్పించారు. వరదతో వందల ఎకరాల్లో చేలు నీట మునిగాయి. ఇసుక మేటలు కూడా వేశాయి. నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ, తహసీల్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు. ఆదిలాబాద్-కరంజి(టీ) రూట్ లో బస్సుల రాకపోకలను ఆదివారం పునరుద్ధరించారు.
పెన్‌గంగ సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్ అన్నారు. ఆదివారం మండలంలోని మణియార్‌పూర్, దహిగాం, గూడ గ్రామాలను బీఆర్ ఎస్ నాయకులు, ఎంపీడీవో మహేందర్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈయన వెంట ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్పవర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కళ్యాం ప్రమోద్‌రెడ్డి, కో-అప్షన్ మెంబర్ తన్వీర్ ఖాన్, నాయకులు దేవన్న, జక్కుల మధూకర్, మంగేశ్ఠాక్రే ఉన్నారు.
అధికారుల పరిశీలన
పెన్‌గంగ సరిహద్దు ప్రాంతాల్లో శనివారం రాత్రి వరద ప్రభావం అధికం కావడంతో తహసీల్దార్ సర్ఫరాజ్ నవాబ్, ఎంపీడీవో మహేందర్ కుమార్, ఎంపీవో సమీర్ హైమద్ సరిహద్దు గ్రామాల్లోనే ఉండి ప్రజలను అప్రమత్తం చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు కలెక్టర్‌కు తెలియజేశారు. బెదోడ, సాంగిడి, మాంగ్రూడ్, మణియార్‌పూర్ గ్రామాలు జలదిగ్బంధంలో ఉండడంతో రాకపోకలు నిలిచాయి.
నిలిచిన రాకపోకలు
తెలంగాణతోపాటు మహారాష్ట్రలో ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మాకిడి, జక్కాపూర్, హు డ్కులీ, వెంకట్రావ్‌పేట్, పారిగాం, లోనవెల్లి గ్రామాల మీదుగా పెన్‌గంగ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మండలంలోని వెంకట్రావ్‌పేట్ అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి వరద పోటెత్తుతోంది. మండలంలోని హుడ్కులీలోని లోలెవల్ వంతెన బ్యాక్ వాటర్‌తో మునిగింది. దీంతో హుడ్కులీ, జక్కాపూర్, మాకిడి గ్రామాలతోపాటు మహారాష్ట్రకు రాకపోకలు నిలిచాయి. వెంకట్రావ్‌పేట్ బ్రిడ్జిను ఆదివారం ఎస్ ఐ రమేశ్ సందర్శించి, మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేశారు. కాగా, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ వరద ప్రవాహాన్ని పరిశీలించారు.