తానూర్, జూలై, 19: పేద ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో నెలకొన్న పరిస్థితుల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో మండల ప్రజల ఫిర్యాదులతోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
హాస్పిటల్లో సిబ్బంది నిర్లక్ష్యం పట్ల వారిని హెచ్చరించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా సిబ్బంది లేకపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లా వైద్యాధికారితో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్లక్ష్యాన్ని తెలియజేశారు. వీరి వెంట బిజెపి మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, నాయకులు శివాజీ పటేల్, చిన్నారెడ్డి, మారుతి, దేవి దాస్ పటేల్, బండారి సోమనాథ్, తదితరులు ఉన్నారు.