మంచిర్యాల, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికార హస్తం పార్టీలో ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడుతున్నది. మంచిర్యాలలో జిల్లాలో గడ్డం వివేక్‌కు మంత్రి పదవి ఇవ్వడం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేలకు ఏ మాత్రం ఇష్టం లేదని తెలుస్తున్నది. మంచిర్యాల జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు దవాఖాన ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణను పిలవలేదని, ప్రొటోకాల్ పాటించలేదని ఎంపీ అనుచరులే తీవ్రంగా మండిపడ్డారు.
ఇకపోతే నిన్న మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా బెల్లంపల్లికి వెళ్లిన ఎంపీ వంశీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అమిత్ షా వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. ఈ సమయంలో ఎంపీ వంశీ పెదనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం నియోజకవర్గంలోనే ఉన్నారు. కానీ ఎంపీ కార్యక్రమానికి రాలేదు. దీంతో బెల్లంపల్లిలోనూ ఎంపీకి ప్రొటోకాల్ దొరకలేదనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. ఇకపోతే ఎంపీ వంశీ మంగళవారం పెద్దపల్లిలో నిర్వహించిన ప్రెస్మీట్లో తన విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ అసహసం వ్యక్తం చేశారు. అఫీషియల్ గవర్నమెంట్ ఈవెంట్స్‌కి కూడా నాకు ఇన్విటేషన్ రావడం లేదంటూ చెప్పుకొచ్చారు.
సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ‘ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. నేను ప్రజల కోసం పని చేస్తాను. ఎవరి పిలుపు కోసం ఎదురు చూడను’ అంటూ స్పష్టం చేశారు. ఈ రోజు కూడా ధర్మపురిలో కార్యక్రమాలు ఉన్నాయి కానీ నాకు ఇన్విటేషన్ రాలేదంటూ మాట్లాడారు. కలెక్టర్ ఎవరి ఆదేశాల మీద పని చేస్తున్నారో తెలియదంటూ.. తాను మాత్రం ప్రజల కోసమే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం, మంథని ఇలా ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఎంపీ విషయంలో ప్రొటోకాల్ పాటించని ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయంటూ ఆ పార్టీ లీడర్లే చెబుతుండడం గమనార్హం.
ఎంపీ వంశీ విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రొటోకాల్ పాటించకపోవడానికి అసలు కారణం మంత్రి పదవి అని తెలుస్తున్నది. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన గడ్డం వివేక్ మంత్రి పదవి కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ప్రభుత్వంలో కాక కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామంటూ పలుమార్లు ప్రకటించారు. ఇది పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే ఉన్న మంత్రితో పాటు ఎమ్మెల్యేలకు సైతం రుచించడం లేదనే చర్చ నడుస్తున్నది. మంత్రిపదవి కోసం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే వివేక్ సోదరుడు గడ్డం వినోద్ సైతం పోటీ పడుతున్నారు.
ఈ క్రమంలో మొన్నటి దాకా మంచిర్యాల జిల్లా వరకే పరిమితమైన ఆధిపత్య పోరు.. ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ మొత్తం సోకినట్లు కనబడుతున్నది. మంత్రి పదవి వివేక్ రావడం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేలకు ఇష్టం లేదని.. ప్రస్తుత పరిణామాలే స్పష్టం చేస్తున్నాయి. వివేక్కి మంత్రి పదవి ఇస్తే ఆయన కుమారుడు ఎంపీగా ఉండి పెద్దపల్లి మొత్తాన్ని వారి చేతుల్లోకి తీసుకునే ప్రమాదముందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గడ్డం సోదరుల్లో ఎవరికి మంత్రి పదవి వచ్చినా.. తమకు ఇబ్బందులు తప్పవనే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తున్నది.
అదే జరిగితే మంత్రిగా ఉన్న తను పెద్దపల్లి పార్లమెంట్‌పై పట్టు కోల్పేయే ప్రమాదముందని మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబు సైతం భావిస్తున్నారని, అందుకే మంత్రి పదవి విషయంలో ఆయన గడ్డం కుటుంబానికి సపోర్టు చేయడం లేదని సమాచారం. గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టూర్ సందర్భంగా శ్రీధర్‌బాబు మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్ఆర్కు మద్దతుగా మాట్లాడం సైతం దీనికి బలం చేకూరుస్తున్నది. పైగా పార్లమెంట్ పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్‌బాబుకు విధేయులేనని.. ఈ మేరకు అంతా ఒక్కటయ్యారని.. అందుకే ఎంపీకి ప్రాధాన్యం తగ్గిందని, ఆయన విషయంలో ప్రొటోకాల్ పాటించడం లేదనే ప్రచారం ఇప్పుడు హస్తం పార్టీలో అగ్గి రాజేస్తున్నది.
ఇకపోతే గడ్డం వెంకటస్వామి (కాక) జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించే విషయంలోనూ రాజకీయ జోక్యం జరిగిందనే చర్చ సైతం నడుస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కాక వర్ధంతిని అధికారికంగా నిర్వహించాల్సిందే. అలాంటిది ఓ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించకపోవడానికి కారణం రాజకీయ జోక్యమే అని గడ్డం ఫ్యామిలీ భావిస్తున్నట్లు ఉంది. అందుకే అగ్రకుల మైండ్‌సెట్‌తో ఉన్న కలెక్టర్ కుల పిచ్చితో పని చేస్తున్నారంటూ ప్రెస్‌మీట్‌లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రొటోకాల్ విషయంలో ఇన్ని రోజులు గోప్యంగా సాగిన వార్ ఎంపీ వ్యాఖ్యలతో ఒక్కసారిగా రచ్చకెక్కింది.
ఏది ఏమైనా ఎంపీ విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడం అనేది సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాలను పక్కనపెట్టి అధికారిక కార్యక్రమాల్లో ఆయనకు ప్రాధాన్యం ఇస్తే పార్టీకే మంచిదని పలువురు చెబుతున్నారు. మరి ఇప్పటైనా ఆధిపత్య పోరును పక్కనపెట్టి హస్తం పార్టీ లీడర్లు ఒక్కతాటిపైకి వస్తారా.. లేకపోతే ఇదే తరహాలో వ్యవహరిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.