మంచిర్యాల, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ యార్డులను జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాల కోసం కేటాయించారు. ఈ క్రమంలో రైతు బజారు కోసం నిర్మించిన గదులను మార్కెట్ కమిటీ కోసం ఉపయోగించారు. షెటర్ రూమ్‌లు కావడం, కాస్త ఇబ్బందిగా ఉండడంతో ఆదిత్యా ఎన్క్లేవ్ కాలనీలోని ఒక అపార్ట్మెంట్లోకి మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాంనగర్ సబ్‌స్టేషన్ దగ్గర కొత్త మార్కెట్ కమిటీ భవనానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామంటూ ఆర్భాటం చేశారు. చివరకు బీఆర్ఎస్ హయాంలో మార్కెట్ కమిటీ ఆవరణలోని రైతు బజారు షెటర్ రూమ్‌లలోనే గురువారం పీఎస్సార్ తిరిగి ప్రారంభించారు. గత ప్రభుత్వం చేసిన పనులను తిరిగి ప్రారంభిస్తూ హంగూ ఆర్భాటం చేయగా, ఇదేం కర్మరా బాబు.. అని పలువురు మాట్లాడుకోవడం కనిపించింది. ఇప్పుడున్న ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఏమైనా కొత్త పనులను చేపట్టాలి కాని, పాత పనులను, పాత బిల్డింగ్‌లను తిరిగి ప్రారంభించి కొత్తగా చేసినట్లు చెప్పుకోవడమేమిటని జనాలు గుసగుసలాడుకున్నారు.