ఆదిలాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి రంగాలకు పెద్దపీట వేసిందని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన 100 మంది యువకులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం యువకులు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేలా చర్యలు తీసుకుందన్నారు. ఆదిలాబాద్ జిల్లా విద్యార్థుల కోసం వ్యవసాయ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసిందని తెలిపారు. యువకులు బీఆర్ఎస్ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జైనథ్ ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి, లింగారెడ్డి, ఉదయ్, కూర నరేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.