తలమడుగు, సెస్టెంబర్ 16 : ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని దేవాపూర్ గ్రామంలో శ్రావణ మాసంలో నెల రోజుల పాటు నిర్వహించిన శబరిమాత అఖండ జ్యోతి ముగింపు కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌తో పాటు పలువురు పార్టీ నాయకులతో కలిసి ఆయన శబరిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. గ్రామంలో పలువీధుల గుండా పల్లకీ శోభాయాత్ర నిర్వహించారు. భజన సంకీర్తనలు, మహిళల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉంటూ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే జోగు రామన్న కొనియాడారు. అనంతరం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రముఖులను సత్కరించారు. డీడీసీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఇచ్చోడ ఎంపీపీ ప్రీతమ్ రెడ్డి, జడ్పీటీసీ గణేశ్ రెడ్డి, సర్పంచ్ అబ్దుల్లా, నాయకులు సంజీవ్ రెడ్డి, కేదారేశ్వర్ రెడ్డి, వసంత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వెంకటేశ్, కిరణ్, పార్టీల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 16 : హిందీ భాషాభివృద్ధి కోసం విద్యా మార్తాండ్ అవార్డు గ్రహీత దివంగత ప్రకాశ్ గౌడ్ చేసిన సేవలు అమోఘమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో హిందీ భాషా సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన హిందీ దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. త్వరలోనే హిందీ భవన్ కోసం భవనాన్ని కేటాయిస్తానని తెలిపారు.
హిందీ ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖన, దేశభక్తి, గేయాల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బెదొడ్కర్ సంతోష్‌తో పాటు నలుగురు హిందీ పండితులను శాలువాలతో సన్మానించారు. హిందీ భాష సేవా సమితి అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి సాహితీవేత్త మధుబావల్కార్, రవి జాబ్దే సాంబన్న, భాస్కర్, చంద్రకళ, రేఖ, వినాయక డిగ్రీ కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, హిందీ పండితులు, భాషాభిమానులు పాల్గొన్నారు.