బేల, జూన్ 18 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథతో తాగునీటి గోస తీరిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లా బేలలో మంచినీళ్ల పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మంచినీళ్ల ప్రాముఖ్యతపై ర్యాలీ తీశారు. అనంతరం వాటర్‌ట్యాంకు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రజలు నీళ్ల కోసం ఎన్నో కష్టాలు పడేవారని, కలుషిత నీరు తాగి వ్యాధుల బారినపడ్డారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రూ.38వేల కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధమైన నీరు అందజేస్తున్నారన్నారు. ఇప్పుడు ప్రతి గిరిజన గ్రామం నుంచి గూడేల వరకు తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. బేల గ్రామ పంచాయతీ పరిధిలోని పలు సమస్యలు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బేల సర్పంచ్ ఇంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, సతీశ్‌పవార్, దేవన్న, జక్కుల మధుకర్, మంగేశ్ఠాక్రే, విఠల్, విపిన్ఖోడే, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఏఈ శాంతికుమార్, ఎంపీడీవో మహేందర్‌కుమార్, ఎంపీవో సమీర్హైమద్, వార్డుసభ్యులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.