నేరడిగొండ, మే 24 : ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులతోపాటు అధికార యంత్రాంగం ప్రజాశ్రేయస్సు కోరి అందరం కలిసి పనిచేయాల్సిన అవసరముందని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, అటవీశాఖ అధికారులు, మం త్రులు కొండా సురేఖ, సీతక్క, ఆటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీం, పీసీసీఎఫ్ సువర్ణ, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీసీఎఫ్లు, డీఎఫ్వోలతో హైదరాబాద్లోని సెక్రెటేరియట్లో సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. బోథ్ నియోజకవర్గం అంటేనే ఆదివాసీల నియోజకవర్గమని, ఇందులో చాలా గిరిజన గ్రామాలు ఉన్నాయన్నారు. ఆ గ్రామాలకు వెళ్లేందుకు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైతే అటవీశాఖ అనుమతులు లేక నిలిచిపోయాయని అన్నారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం రోడ్ల నిర్మాణానికి నిధులు వెచ్చిస్తుంటే, మరో వైపు అటవీశాఖ అనుమతులతో అభివృద్ధి పనులు నిలిచిపోవడం సరికాదని, ఈ విషయమై గతంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించడం జరిగిందన్నారు. అదే విధం గా బోథ్ నియోజకవర్గంలో చాలా మంది మారుమూల గ్రామాల్లో గిరిజనేతరులు (ఎస్సీ, బీసీ,మైనార్టీ) రైతులు పోడు వ్యవసాయం చాలా సంవత్సరాలుగా చేసుకుంటున్నారని తెలిపారు. వ్యవసాయం చేయకుండా అటవీ అధికారులు అడ్డుపడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోడు వ్యవసాయంపై ఆటంకాలు కలిగించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులకు, అటవీ అధికారులకు విన్నవించారు.
గత ప్రభుత్వ హయాంలో పోడు భూముల సర్వే చేయడం జరిగిందని అందులో గిరిజనేతరుల భూములు కూడా ఉన్నాయని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇప్పించేలా చూడాలని మంత్రులు సీతక్క, కొండా సురేఖను కోరారు. ఈ విషయంలో గిరిజనేతరులను పోడు వ్యవసాయ విషయంలో ఇబ్బందులు పెట్టవద్దని అధికారులను ఆదేశిస్తామని మంత్రులు చెప్పినట్లు తెలిపారు.