మంచిర్యాల, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వేమనపల్లి, ఏప్రిల్ 5 : బెల్లంపల్లిలో బీఆర్ఎస్ సైన్యాన్ని చూసి ప్రత్యర్థి పార్టీల్లో వణుకుపుడుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బెల్లంపల్లిలో మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో 14 గ్రామాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నారదాసు లక్ష్మణ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, పేదలకు పింఛన్‌లాంటి కార్యక్రమాలు అమలు కావడం లేదని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమనేది యావత్ దేశానికి తెలిసిపోయిందన్నారు. అందుకే కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా లక్షలాది మంది వస్తున్నారని చెప్పారు. మొన్నటికి మొన్న మహారాష్ట్ర సభకు ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారన్నారు. కార్యకర్తలందరూ పార్టీకి అండగా ఉండి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను మరోసారి ఆదరించాలని పిలుపునిచ్చారు.
మీ బిడ్డను ఆదరించండి : ఎమ్మెల్యే
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను పక్క రాష్ర్ర్టాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్నాటక ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్‌ను ఏం చేయాలేక ప్రధాని మోదీ కేసీఆర్ కుటుంబంపై ఈడీ దాడులు చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు వస్తున్న కార్యకర్తలు, జనాలను చూసి ప్రత్యర్థి పా ర్టీలు తట్టుకోలేకపోతున్నాయన్నారు. అందుకే నీచ రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీని, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో నాపై చేసింది పూ ర్తిగా దుష్ప్రచారమని చెప్పుకొచ్చారు. రెండు రోజుల్లో పూ ర్తి ఆధారాలతో నిజానిజాలను ప్రజల ముందు ఉంచుతానని స్పష్టం చేశారు. నాపై ఎంత బురద చల్లే ప్రయత్నం చేసినా వాళ్లకు వచ్చేది తాత్కాలిక ఆనందమే చెప్పారు. ఏ నాటికైనా నిజం నిప్పులా బయటికి వస్తుందని, అప్పుడు మీ అబద్ధపు ప్రచారాన్ని ప్రజలే ఖండిస్తారని తెలిపారు. బెల్లంపల్లిలో మూడోసారి చిన్నయ్యను గెలవకుండా చేయాలనే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయాలున్న వ్యక్తులు రాబోతున్నారని, ఎవరు వచ్చినా ఈ బిడ్డను ఆదరించాల ని విజ్ఞప్తి చేశారు. 50వేల మంది కార్యకర్తల అండ ఉన్న బిడ్డనని, ఓటు అనే ఆయుధంతోనే వేల కోట్ల రూపాయాలున్న వారికి సమాధానం చెప్తామన్నారు.
వేమనపల్లి, నె న్నెల మండలాల ప్రజలకు తాను చిన్నప్పటి నుంచి తెలుసని, ఏ కష్టమొచ్చినా మీ ఇంటి పెద్ద కొడుకులా మీ సమస్యలు తీరుస్తున్నానని, ఏ కష్టమొచ్చినా మీ ముందుంటానన్నారు. వేమనపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, నీల్వాయి బ్రిడ్జితో పాటు మత్తడివాగు బ్రిడ్జిలను నిర్మించి రవాణా కష్టాలను దూరం చేశానని చెప్పారు. ఒకప్పుడు రోడ్డు లేని మండల కేంద్రంలో రోడ్లు వేయించామన్నారు. త్వరలోనే కోటపల్లి నుంచి నీల్వాయి మీదుగా వేమనపల్లి రోడ్డు పూర్తి చేసి చూపిస్తామని తెలిపారు. రైతుబంధు ద్వారా మండలంలో రూ.55 కోట్లు రైతుల ఖాతాలో వేశామని, 72 మంది రైతులు చనిపోతే వారి ఖాతాల్లో రైతుబీమా డబ్బులు జమ చేశామని, సుమారు 400 మందికి సీఎంఆర్ఎఫ్ కింద వైద్యఖర్చులు కూడా అందజేశామని చెప్పారు. ఇవన్నీ మీ కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాలన్నారు. జెండాలు పట్టుకొని వచ్చే కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు ఇవి చూపించి నిలదీయాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదో తరగతి పరీక్ష పత్రాలను లీకేజీ చేయించి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కుట్రలు పన్నాడన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వెనుక ఉంది సైతం బండిసంజయ్ మనషులేనని ఆరోపించారు. ఆ ఉసురు తగిలే సంజయ్ అరెస్టు అయ్యాడని మండిపడ్డారు. జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మండల ఎంపీపీ కోలి స్వర్ణలత, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కోలి వేణుమాధవ్‌రావు, సింగిల్ విండో చైర్మన్ గూడ కిషన్‌రావు, వైస్ ఎంపీపీ ఆత్రం గణపతి, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లింగాగౌడ్ 14 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.