ప్రతి విద్యార్థి గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. గురువారం బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఆర్సీవో స్వరూపారాణి, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేతతో కలిసి జోనల్‌స్థాయి సైన్స్ ఫెయిర్‌ను అట్టహాసంగా ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి 236 మంది విద్యార్థులు పాల్గొని, 118 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి సమాజానికి మేధావులను అందించాలని ఎమ్మెల్యే కోరారు.
బెల్లంపల్లిరూరల్, నవంబర్ 24 : ప్రతి విద్యార్థి గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న గురుకులాల జోనల్‌స్థాయి సైన్స్ ఫెయిర్‌ను గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆర్సీవో కే స్వరూపారాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేతతో కలిసి ఎమ్మెల్యే జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ వెనుకబడిన వర్గాల ప్రజల కోసం వ్యవసాయ, విద్య, వైద్యం రంగాల్లో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు.
మైనార్టీలు, గిరిజనులు, దళితులు, బీసీల కుటుంబాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేరువ చేసేలా అధికారులు పని చేయాలని సూచించారు. మెరుగైన విద్యను అందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలన్నారు. సమాజాన్ని మార్చే శక్తి కేవలం ఉపాధ్యాయులకే ఉందన్నారు. సమాజానికి గొప్ప శాస్త్రవేత్తలను, మేధావులను అందించే విధంగా ప్రతీ ఉపాధ్యాయుడు అంకితభావంతో పని చేయాలన్నారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా నుంచి 112 మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యాలయాల్లో చదువుకుంటుండడం ఆనందంగా ఉందన్నారు. బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.రాజేశ్వర్‌నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలతో దేశానికి వెన్నుదన్నుగా నిలవాలన్నారు. సైన్స్‌ని వినియోగించుకొని ఏపీజే అబ్దుల్ కలాం ప్రపంచం గర్వించదగ్గ మిస్సైల్ మ్యాన్‌గా గుర్తింపు పొందారన్నారు.
గురుకులాల ఆర్సీవో కే స్వరూపరాణి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ సంక్షేమ గురుకులాలు విద్యతో పాటు విద్యేతర కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచాయన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథంపై ఆసక్తిని కలిగించేలా సైన్స్ ఉపాధ్యాయులు తరగతి గదిలో మారుతున్న శాస్త్ర సాంకేతికతను ఉపయోగిస్తున్నారన్నారు. కరోనా తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న జోనల్‌స్థాయి సైన్స్ ఫెయిర్‌లో 118 ప్రదర్శనలు శాస్త్రీయ ఆలోచనలు ప్రేరేపించేలా ఉండడం వెనుక ఉపాధ్యాయుల కృషి ఉందన్నారు. ఉమ్మడి జిల్లాల గురుకులాల ప్రిన్సిపాళ్ల సమన్వయంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఏఆర్సీవో కే ఉమామహేశ్వర్రావు, ఏడీఏ సురేఖ, ఎంఈవో పీ మహేశ్వర్‌రెడ్డి, బెల్లంపల్లి బాలుర, బెల్లంపల్లి బాలికల, కాసిపేట గురుకులాల ప్రిన్సిపాల్స్ ఐనాల సైదులు, స్వరూప, సంతోష్‌కుమార్, గురుకులాల ప్రిన్సిపాల్స్ జ్యోతి, శ్రీనాథ్, బాలరాజు, బాలభాస్కర్, రమేశ్‌బాబు, ప్రేమరాణి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రముఖులు పాల్గొన్నారు.
సకల ఏర్పాట్లు
బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో గురువారం నుంచి శనివారం వరకు అట్టహాసంగా నిర్వహించనున్న సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనే విద్యార్థుల కోసం ఆర్సీవో కే స్వరూపరాణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. విద్యార్థులకు తాగునీటి సదుపాయంతో పాటు భోజన వసతి కల్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని 59 గురుకులాల నుంచి 236 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గణితం, సైన్స్ అండ్ టెక్నాలజీ, జీవవైవిధ్యం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, కళలు, సంస్కృతి అంశాలపై 118 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. బాలురకు బెల్లంపల్లి సీవోఈ, కాసిపేట గురుకులాల్లోనూ.. బాలికలకు బెల్లంపల్లి బాలికల గురుకులంలో వేర్వేరుగా వసతి ఏర్పాటు చేశారు.