రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం సాధించిన ప్రగతిని సూచిస్తూ ముద్రించిన కరదీపికలు గ్రామ పంచాయతీ(జీపీ)లకు చేరుకున్నాయి. 2014-2023 వరకు సాధించిన విజయాల చిత్రపటాలతో బుక్లెట్స్ ఉన్నాయి. కేసీఆర్ హయాంలో సకల హంగులతో నిర్మించిన సచివాలయ చిత్రం ఆకట్టుకుంటున్నది. మిషన్ భగీరథతో పల్లెల్లో తీరిన నీటి కష్టాలు, నిరంతర కరెంట్‌తో మెరుగు పడిన జీవన విధానాన్ని సూచించారు.
మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో అందుతున్న సాగునీటి సౌకర్యాలు, వాటి కోసం వెచ్చించిన నిధుల వివరాలను పొందు పరిచారు. తెలంగాణకు హరితహారంతో పచ్చబడ్డ పల్లెలు, పట్టణాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన పురస్కారాలను ప్రస్తావించారు. బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత, చీరల పంపిణీ ప్రాధాన్యతలను వివరించారు. కనీవినీ ఎరుగనిరీతిలో పట్టణాలు, పల్లెల్లో మెరుగు పడిన రోడ్డు సౌకర్యాలు, అవుటర్ రింగ్‌రోడ్లు, ఓఆర్ఆర్ తదితర వాటి చిత్రాలను ముద్రించారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కళ్లకు కట్టినట్లుగా తెలంగాణ అభివృద్ధి కరదీపికలో చూపించారు.