మీరు చూస్తున్న చిత్రం.. మబ్బులను తాకుతూ నింగిలోకి దూసుకెళ్తున్న రాకెట్లా కనిపి స్తుంది కదూ.. అలా అనుకుంటే పొరపడినట్టే. మరీ పౌంటెయిన్ నుంచి పాలబుగ్గల జలదార పైకి వస్తుందనుకుంటున్నారా.. అదీ కాదు.. ఎంటంటే.. కేసీఆర్ సర్కారు ప్రజల కు శుద్ధజలం అందించాలన్న లక్ష్యంతో మిషన్ భగీరథను ప్రవేశపెట్టింది.
నేటి కాంగ్రెస్ సర్కారు భగీరథ పథకంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో చాలా చోట్ల పైపులు లీకేజీ అవుతున్నాయి. ఈ చిత్రం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని న్యూలోలం వద్ద పైపులైన్ లీకేజీ కావడంతో మంచినీరు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నది. దీంతో ప్రజలకు మంచినీరు దొరుకక అవస్థలు పడుతున్నారు. దీనికితోడు పొలాల్లోనికి నీరు చేరడంతో పంట నష్ట పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– దిలావర్పూర్, ఆగస్టు 13
ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం
ఇచ్చోడ, ఆగస్టు 13 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక జాయింట్ యాక్షక్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు రాజేశ్వర్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో ఉన్న 341 ఆర్టికల్‌ను సవరించకుండా అన్నదమ్ముల లాగా కలిసి ఉన్న ఎస్సీలను విడదీసి కులాల మధ్య చిచ్చును రేపుతున్నారన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. త్వరలోనే వర్గీకరణ వ్యతిరేక పోరాట ప్రణాళిక ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల శంకర్, అంగుర్ల నాగన్న, సల్లం రమేశ్, కటకం వెంకటేశ్, రాజు, గంగయ్య పాల్గొన్నారు.
దివ్యాంగులకు సదరమ్ పరీక్షలు
నిర్మల్ చైన్‌గేట్, ఆగస్టు 13 : నిర్మల్ ప్రభుత్వ దవాఖానలో మంగళవారం దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సదరమ్ ధ్రువీకరణ పత్రాల కోసం 70 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం వైద్యాధికారులు రవి, సృజన్‌లు పరీక్షలు చేశారు. గంటల తరబడి వేచి ఉన్నారు. శిబిరం వద్ద దివ్యాంగులు కూర్చోవడానికి వసతులు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. అధికారులు శిబిరాల వద్ద దివ్యాంగుల కొరకు వసతులు కల్పించాలని కోరారు.
బంద్ ప్రశాంతం
ఎదులాపురం, ఆగస్టు 13 : బంగ్లాదేశ్‌లో హిందువులు, ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ చాంబర్ అఫ్ కామర్స్ పిలుపు మేరకు ఆదిలాబాద్ పట్టణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దుకాణాలను మూసి ఉంచారు. హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వ్యాపారస్తులు బంద్‌లో పాల్గొని సంఘీభావం తెలిపారు. బంద్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు.