SSC Exams | ఉట్నూర్, మార్చి 4 : ఉట్నూర్‌లో పదోతరగతి తెలుగు పేపర్ జవాబు పత్రాల సంచి మిస్సింగ్ కలకలం రేపింది. ఇందులో పూర్తిగా పోస్టాఫీస్ సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తున్నది. సోమవారం సాయంత్రం జవాబు పత్రాలు గల సంచి మిస్సవగా, రాత్రి వరకు దాచి ఉంచారు. అనంతరం ఉట్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. దీనిపై ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా మంగళవారం విచారణ చేపట్టారు. ముందుగా ఉట్నూర్ పోస్టాఫీస్‌కు చేరుకున్నారు. కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఉట్నూర్ డీఎస్పీ, జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు, పోస్టాఫీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పదోతరగతి తెలుగు పేపర్ పరీక్ష ప్రారంభమైంది. ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత, బాలిక ఆశ్రమ, క్రీడాశ్రమ పాఠశాలలతో పాటు, పూలాజీబాబా స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఏ, బీ రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా రెగ్యులర్ వెయ్యి మంది, ప్రైవేట్‌గా 11 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. జవాబు పత్రాలను సంచిలో వేసి, విద్యాశాఖ ఉట్నూర్ పోస్టాఫీస్ సిబ్బందికి అప్పగించారు. వీటితో పాటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం నుంచి వచ్చిన జవాబు పత్రాల సంచులతో కలిపి (11 సంచులు) ఆటోలో బస్టాండ్‌కు తరలించారు. అక్కడికి వెళ్లాక చూసేసరికి ఒకటి మిస్సయ్యింది. దీంతో ఖంగుతిన్న సిబ్బంది, రోడ్డు మార్గంలో, పోస్టాఫీస్‌లో వెతికారు. అయినా దొరక్కపోవడం.., అప్పటికే వికారాబాద్ జిల్లాలో పేపర్ లీక్ రాష్ట్ర వాప్తంగా సంచలనడమవడంతో భయపడ్డ సిబ్బంది, రాత్రి ఉట్నూర్ ఎస్ఐ భరత్ సుమన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రోడ్లపై వెతకడం ప్రారంభించారు.
మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల కేంద్రంలో 11 మంది ప్రైవేట్ విద్యార్థులకు గాను 9 మంది పరీక్ష రాశారు. వారు రాసిన సంచే కనబడడం లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జవాబు పత్రాలను విద్యాశాఖ అధికారులు పోస్టల్ సిబ్బందికి అందించినట్లు ఆధారాలున్నట్లు అదనపు కలెక్టర్ విచారణలో తేలింది. కాగా, ఎస్ఐ భరత్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయినా దొరక్కపోవడంతో జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అన్ని కోణాల్లో విచారణ వేగవంతం చేసింది.
జవాబు పత్రాల మిస్సంగ్ వ్యవహారంలో పోస్టాఫీస్ ఎంటీఎస్ రజితను సస్పెండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న నాగరాజును తొలగించారు. ఈ మేరకు పోస్టాఫీస్ జిల్లా అధికారి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, జవాబు పత్రాలు మిస్సింగ్ విషయం తెలిసిన ఎంటీఎస్ రజిత ఫిట్స్ వచ్చి పడిపోయింది. ఉట్నూర్ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి రిమ్స్‌కు తీసుకెళ్లారు.
జవాబు పత్రాల మిస్సింగ్‌పై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కలెక్టర్ రాహుల్ రాజ్, డీఈవో ప్రణీతకు ఫోన్ చేశారు. పోస్టాఫీస్ సిబ్బంది నిర్లక్ష్యం కనబడుతున్నదని, జవాబు పత్రాలను ఆటోలో తరలించడం ఏంటని ప్రశ్నించారు. ఏజెన్సీలో విద్యార్థులకు అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.