బాసర, జూలై 12 : బాసర సరస్వతీ క్షేత్రం అభివృద్ధికి మాస్టర ప్లాన్ అమలువుతుందని అనుకున్న ఆశావహుల్లో నిరుత్సాహమే మిగిలింది. శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కార్మిక శాఖ మంత్రి వివేక్ అమ్మవారిని దర్శించుకుని బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన రూ.13 కోట్లతో నిర్మించిన టీటీడీ 100 రూముల అతిథి గృహం, అడ్మినిస్ట్రేషన్ భవనాలను ప్రారంభించారు.
బాసర క్షేత్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం కాలేదని మంత్రి కొండా సురేఖ విలేకరుల సమావేశంలో తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయాల్సి వస్తుందేమోనని, సీఎం ఆమోదం వచ్చాకే నిర్ణయిస్తామని అన్నారు. ప్రస్తుతానికి మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.40 లక్షలు విడుదల చేస్తున్నామని, ఇంకా కోటి రూపాయలను ఇతరాత్ర పనులకు విడుదల చేస్తామని మంత్రి అన్నారు. ఒక పక్క రెండు రోజుల్లోనే మాస్టర్‌ప్లాన్ ఆమోదం పొందేలా చేస్తామని మంత్రి అనడం కొసమెరుపుగా మారింది.
రెండు రోజుల్లోనే రెగ్యూలర్ ఈవోను కూడా నియమించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్భాటంగా వచ్చిన మంత్రి భవన నిర్మాణాన్ని ప్రారంభించి మాస్టర్‌ప్లాన్ అమలుపై స్పష్టత ఇవ్వకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాసర ఆలయ అభివృద్ధి పనులకు దీపావళి వరకు సమయం ఇస్తున్నానని, అప్పటి వరకు మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించి అమలు చేయకపోతే నిరాహార దీక్ష చేస్తానని స్థానిక ఎమ్మెల్యే రామరావు పటేల్ అన్నారు. కార్యక్రమంలో మంత్రులతోపాటు ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణ్‌రావు పటేల్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణ పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లు విడుదల చేసిందని, అదే విధంగా 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు కేంద్రమే నిధులు మంజూరు చేయించే బాధ్యత మీపై ఉందని ఎంపీ గేడం నగేశ్, ఎమ్మెల్యే రామారావుకు మంత్రి కొండా సురేఖ సవాలు విసిరారు. దీంతో ఎంపీ నగేశ్ మాట్లాడుతూ.. ప్రసాద్ స్కీంలో భాగంగా త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెడుతుందో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇవ్వాలో నివేదికలను పంపితే వచ్చే విధంగా చూస్తామన్నారు.