మంచిర్యాల, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేసీఆర్ సర్కారులో చెన్నూర్ నియోజకవర్గం ఓ వెలుగు వెలిగింది. అప్పటి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిధుల వరద పారించి చెన్నూర్ నియోజవర్గాన్ని ప్రగతిపథంలో నడిపించి ఆదర్శంగా తీర్చిదిద్దారు. రాష్ట్ర మంత్రులను రప్పించి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టి ప్రశంసలు అందుకున్నారు. కానీ, కాంగ్రెస్ పాలనలో చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించేందుకు మంత్రులు మొహం చాటేసే పరిస్థితి ఏర్పడుతున్నది.
తండ్రి ఎమ్మెల్యేగా, తనయుడు ఎంపీగా ఎన్నుకోబడిన చెన్నూర్ నియోజకవర్గంలో మంత్రులు షెడ్యూల్ ప్రకటించడం.. ఆపై పర్యటనలు వాయిదా వేసుకోవడాన్ని చూసి చెన్నూర్ ప్రజలు నవ్వుకుంటున్నారు. గత నెల 30న చెన్నూర్ నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పలు ప్రారంభోత్సవాలకు హాజరుకావాల్సి ఉండగా, చివరి నిమిషంలో వారి పర్యటనను రద్దు చేసుకున్నారు.
కాగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావుల మధ్య పొసగకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రుల పోగ్రాం రద్దు కావడం తండ్రీ కొడుకులైన వివేక్, వంశీలను నిరాశపరచగా, శుక్రవారం చెన్నూర్‌లో పలు అభివృద్ది పనులకు హాజరుకావాల్సిన మంత్రి సీతక్క కూడా అదే బాటలో పయణించడం వారికి మింగుడు పడడం లేదు.
శుక్రవారం చెన్నూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు హాజరుకావాల్సిన మంత్రి సీతక్క తన పర్యటనను ఒకరోజు ముందుగానే రద్దు చేసుకోవడంతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ఇంటికి వెళ్లి మరీ కలవడం విస్మయానికి గురి చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీని వీడకుండా కష్టకాలంలోనూ పార్టీ వెన్నంటి ఉండి పని చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రేంసాగర్‌రావు.. పార్టీలు మారుతూ చివరికి కాంగ్రెస్‌లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్‌కు చెక్ పెట్టాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.
అసహనం వ్యక్తం ప్రజలు
గత నెలలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రుల ప్రారంభోత్సవాలు ఉన్నాయంటూ ప్రజలను సాయం త్రం వరకు ఉండేలా చేసి చివరి నిమిషంలో కార్యక్రమం రద్దయిందని చెప్పడంపై విస్మయం వ్యక్తమైంది. తాజాగా చెన్నూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన మంత్రి సీతక్క కార్యక్రమం కూడా రద్దు కావడంతో నియోజకవర్గ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తండ్రీకొడుకులు ఎమ్మెల్యే, ఎంపీలుగా ఉన్న నియోజకవర్గంలో రెండుసార్లు మంత్రుల కార్యక్రమాలు రద్దు కావడం చూసి సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
నాడు క్యూ కట్టిన మంత్రులు
కేసీఆర్ ప్రభుత్వంలో చెన్నూర్ నియోజకవర్గ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు క్యూ కట్టారు. అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్ అనేక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు మంత్రులను ఆహ్వానించారు. అభివృద్ధి చెందిన నియోజకవర్గాలతో చెన్నూర్ కూడా పోటీ పడింది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాటు అప్పటి మంత్రులు, కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, చామకూర మల్లారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు మంత్రులను తీసుకురాగా, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఒక మంత్రి కూడా రాకపోవడం స్థానిక ఎమ్మెల్యే పనితీరుకు అద్దం పడుతుంది.