ఆదిలాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మంత్రులు గురుకులాల సందర్శనలో భాగంగా శనివారం మంత్రి సీతక్క జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందుస్తుగా అరెస్టు చేశారు. దీంతోపాటు మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని, నేరడిగొండ గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఫొటో పెట్టలేదంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.
ఉట్నూర్, బోథ్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ పాలన కొనసాగిస్తున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విస్మరిస్తుందని మండిపడ్డారు. ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన ఎమ్మెల్యేగా ఉన్న తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజాప్రతినిధులను విస్మరించడం, ఓ ప్రజాప్రతిధికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని అన్నారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ నచ్చచెప్పడంలో వివాదం సద్దు మణిగింది.