ఇంద్రవెల్లి, ఏప్రిల్ 20 : హీరాపూర్ గ్రామ సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద రగల్ జెండా అమరవీరుల ఆశయ సాధన కమిటీ, ఆదివాసీ గిరిజన పెద్దల ఆధ్వర్యంలో స్వేచ్ఛగా నివాళులర్పించారు. ఏప్రిల్ 20, 1981లో పోలీసుల కాల్పుల్లో అమరులైన ఆ దివాసులకు గిరిజనులు తమ సంస్కృతి సం ప్రదాయబద్ధంగా పూజలు చేసి, శ్రద్ధాంజలి ఘటించారు. అధికారికంగా నిర్వహించిన 44వ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు ఆదివారం ఉదయం10 గంటలకు అ మరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు.
గోండ్‌గూడ నుంచి ప్రారంభమైన ర్యాలీ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుంది. ముందుగా అమరవీరుల పేరిట జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నిర్వహించే సంప్రదాయ పూజ కార్యక్రమాలను ప్రారంభించారు. అమరవీరుల స్తూపంతోపాటు జెండాల వద్ద సంప్రదాయ ప్రకారం పూజలు నిర్వహించి, అమరవీరుల కుటుంబ సభ్యులతోపాటు ఆదివాసులు నివాళులర్పించారు.
గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసి మృతి చెందిన తోడసం ఖట్టికి తుమ్మగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. మండలంలోని తుమ్మగూడ గ్రామస్తుల ఆధ్వర్యంలో సమక ఎక్స్‌రోడ్డు వద్ద ఖట్టి స్మారకార్థం ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించి నివాళులర్పించారు. యేటా ఏప్రిల్ 20న సంస్మరణ దినంగా నిర్వహిస్తున్నామన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎంపీ గోడం నగేశ్, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, ప్రేమ్‌సాగర్ రావు, కోవ లక్ష్మి, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఏఎస్పీ కాజల్‌సింగ్, డీఎఫ్‌వో బాజీరావ్ పాటిల్, మాజీ ఎంపీ సోయం బాపురావ్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగణక్క, బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్, ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్, రాయిసెంటర్ల సార్మేడీలు మెస్రం వెంకట్రావ్పటేల్, మెస్రం చిన్ను పటేల్, ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు గోడం గణేశ్, కోడప నగేశ్, ఆత్రం భుజంగ్‌రావ్, కనక తుకారాం, ముకాడే విష్ణు, బోంత ఆశా రెడ్డి, తిరుపతి, కనక హనుమంత్‌రావ్, పెందర్ పుష్పారాణి, గరల్ జెండా అమరవీరుల ఆశయ సాధన కమిటీ అధ్యక్షుడు తొడసం నాగోరావ్, ప్రధాన కార్యదర్శి మెస్రం నాగ్నాథ్, తుడుందెబ్బ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పుర్కా బాపురావ్, తుడుందెబ్బ మండలాధ్యక్షుడు పుర్కా చిత్రు, గౌరవ అధ్యక్షుడు జుగ్నాక్ భారత్, మాజీ సర్పంచ్ కోరెం గా సుంకట్రావ్, మెస్రం ఆనంద్‌రావ్, కనక తులసీరామ్, మానిక్రావ్, రాజ్వర్ధన్, దీలిప్మోరే, రాజలింగు, కోడప నగేశ్‌లు అమరులకు నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఉట్నూర్ ఏఎస్సీ కాజల్సింగ్తోపాటు ఉట్నూ ర్ సీఐ మొగిలి, ఇంద్రవెల్లి ఎస్ఐ సాయన్నల ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పా టు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండ ముందస్తు చర్యలు తీసుకున్నా రు. పోలీసు అధికారులు దగ్గర ఉండి బందోబస్తును పర్యవేక్షించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పును ఒప్పుకుని ఇంద్రవెల్లి అమరులను గుర్తించి వారి కుటుంబాలను ఆదుకోవడానికి సంక్షేమ పథకాలు అందిస్తుందని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారింగా నిర్వహిస్తుందన్నారు.
1981, ఏప్రిల్ 20న మృతి చెందిన అమరుల కుటుంబాలకు ఇండ్లస్థలంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం నాలుగు కుటుంబాలకు వాహనాలు అందించామన్నారు. కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలను గుర్తించడానికి ఐటీడీఏ ద్వారా కమిటీ ఏర్పాటు చేసి వివరాలు సేకరిస్తామన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి కమిటీని ఏర్పాటు చేసి పూర్తి వివరాలు సేకరించిన తరువాతనే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రూ.15 కోట్లతో ఉట్నూర్‌తోపాటు ఏటురునాగారంలో కొత్తగా ఐటీడీఏ కార్యాలయాల నిర్మాణానికి ప్రణాళికలు చేశామన్నారు.