బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మహిళలకు ప్రాధాన్యం పెరిగిందని, ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం కోటా అమలు చేశామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జడ్పీ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించగా, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. లోక్‌సభలో మహిళా బిల్లు ఆమోదం పొంద డంపై సభ్యులంతా ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేయడంతో పాటు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితమేనని అభిప్రాయపడ్డారు. ఎజెండాలోని అంశాలను చర్చించడంతో పాటు జిల్లాలోని పలు సమస్యలను సభ్యులు సభ దృష్టికి తేగా, అధికారులు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈనెల 25న మంత్రి కేటీఆర్ నిర్మల్ లో పర్యటిస్తారని, పామాయిల్ ఫ్యాక్టరీతో పాటు కాళేశ్వరం 27 ప్యాకేజీ నుంచి రైతులకు సాగునీరు విడుదల చేస్తారని పేర్కొన్నారు.
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 22 : బీఆర్ఎస్ హయాంలో మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చిందని, మహిళాబిల్లు రావడానికి కూడా తమ పార్టీనే కారణమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్లో శుక్రవారం జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్యతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ముందుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై హర్షం వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు 33 శాతం అమలు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో ధర్నా చేయడం వల్లనే అన్ని రాష్ర్టాల మహిళలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేచ్చారని, బిల్లు సాధ్యమైందని వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో అమలు చేసిందని గుర్తు చేశారు.
బిల్లును వీలైనంత త్వరగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అనంతరం ఎజెండాలోని అంశాలపై చర్చించగా, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తమ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబాక్, రైతు బంధు, ఆసరా పింఛన్, కేసీఆర్ కిట్, తదితర పథకాలు ఇతర రాష్ర్టాలు కావాలంటున్నాయని తెలిపారు. నిర్మల్ జిల్లా ఏర్పాటు తర్వాత ఎంతో అభివృద్ధి సాధించిందని, అందుకు సీఎం కేసీఆర్ సహకరం ఎంతగానో ఉన్నదన్నారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలకు రూ.166 కోట్లు నిధులు మంజూరయ్యాయని, యేడాదిలో కొత్త భవనం నిర్మిస్తామన్నారు. 25న రూ.400 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీని కేటీఆర్ ప్రారంభిస్తారని, అదే రోజు 27వ ప్యాకేజీ ద్వారా రైతులకు నీళ్లు అందించే కార్యక్రమం ఉందని వెల్లడించారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జడ్పీ సమావేశంలో సభ్యులు అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలను కలిపే అర్లి వంతెనకు రూ.40 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. విద్య, వైద్యం, మిషన్ భగీరథ, మన ఊరు-మన బడి, చెక్‌డ్యాంల నిర్మాణం, తదితర అంశాలపై చర్చించారు. అంతకుముందు మట్టి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళా బిల్లు హర్షనీయం.. : జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి
అనంతరం జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. దేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా బిల్లుకు పార్లమెంట్ అమోదం తెలుపడం అభినందనీయమని, ఇది మహిళల విజయమని అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కింది స్థాయిలో పోరాటం చేయడం వల్లే కేంద్ర ప్రభుత్వం బిల్లు తెచ్చిందని గుర్తు చేశారు. మహిళలు సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఈ బిల్లు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
సమస్యలపై తప్పక స్పందిస్తాం.. : కలెక్టర్ వరుణ్‌రెడ్డి
ఆ తర్వాత కలెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదన్నారు. సభ్యులు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని, పరిష్కరిస్తామని తెలిపారు. జడ్పీ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అన్ని అంశాలను రాసుకున్నామని, వాటి పరిష్కారానికి అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నట్లు చెప్పారు. నిర్మల్ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. : ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
అనంతరం ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి మాట్లాడారు. జిల్లా ఏర్పడిన తర్వాత జడ్పీ కార్యాలయం నిర్మల్‌కు వచ్చిందన్నారు. ఎన్నో సమావేశాలు ఇక్కడ జరిగాయని, ఎన్నికల నేపథ్యంలో ఇదే చివరి సమావేశం కావచ్చని, వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చారన్నారు. దీంతో పాటు మంత్రి సహకారంతో జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు, సంక్షేమ పథకాలు రావడంతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డీఎఫ్‌వో రాంకిషన్, జడ్పీటీసీలు జీవన్‌రెడ్డి, సరస్వతి, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, రాజేశ్వర్, ఎంపీపీలు రామేశ్వర్‌రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు సుభాష్‌రావు, రఫీక్‌అహ్మద్, జిల్లా అధికారులు దేవేందర్‌రెడ్డి, ప్రసాద్, విజయలక్ష్మి, అంజిప్రసాద్, క్రాంతికుమార్, హన్మండ్లు, రవీందర్‌రెడ్డి, శంకరయ్య, గంగధరయ్య, తదితరులు పాల్గొన్నారు.
గణేశ్ మండప నిర్వాహకులతో సమావేశం
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 22 : పట్టణంలోని గణేశ్ మండపాల నిర్వాహకులతో స్థానిక ఆర్కే కన్వెన్షన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. పట్టణంలో మొత్తం 49 వినాయక ప్రతిమలను ప్రతిష్టించినట్లు తెపారు. ప్రతీ మం డపం వద్ద నిర్వాహకులు వివిధ పోటీలను నిర్వహిస్తూ ప్రజలకు బహుమతులు అందించడం మంచి సాంప్రదాయమని పేర్కొన్నారు. అలాగే కొనసాగించాలని తెలిపారు. సమష్టి సహకారంతోనే ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చని సూచించారు. శోభాయాత్రకు పోలీసులు ప టిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారని, వారికి మండపాల నిర్వాహకులు, ఉత్సవ సమితి సభ్యులు, ప ట్టణ ప్రజలు పూర్తి సహకారం అందించాలని తెలిపారు. శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించడం లో నిర్మల్‌కు మంచి సాంప్రదాయం ఉందని, అ లాగే కొనసాగించాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరు ణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు పతికె రాజేందర్, డీఎస్పీ గంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, అయ్యన్నగారి భూమయ్య, నాయకులు, ఆయా మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
మైనార్టీ మహిళలకు కుట్టు మిషిన్ల పంపిణీ..
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో 300 మంది మహిళలకు మంత్రి అల్లోల ఉచితంగా కుట్టు మిషిన్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా జీవితంలో సొంతగా నిలబడి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. అందుకు ఈ కుట్టు మిషిన్లు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ మహ్మద్ ఇంతియాజ్, కౌన్సిలర్ వేణు, సలీం, నాయకులు, మైనార్టీలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.