ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు దఫాలుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. మంచిర్యాలలోని మందమర్రి, క్యాతన్‌పల్లి బల్దియాల్లో రూ.800 కోట్లకుపైగా.. నిర్మల్ జిల్లాలో రూ.1100 కోట్లకుపైగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో రూ.140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానంగా హాజీపూర్ మండలంలోని పడ్తనపల్లిలో రూ.85 కోట్లతో నిర్మించే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని, రూ.55 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
బంగారు తెలంగాణ ఆశాజ్యోతులు.. భవిష్యత్ తెలంగాణ రథసారధులు.. డైనమిక్ లీడర్లు.. ఐటీ, వైద్యారోగ్యశాఖ అమాత్యులు కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్), తన్నీరు హరీశ్‌రావుల సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా కేటీఆర్ మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో పర్యటించగా.. హరీశ్‌రావు మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాలను చుట్టి వచ్చారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ జనంతో మేమకమవుతూ జోష్ నింపారు. ఒక దఫా అన్ని నియోజకవర్గాలు చుట్టి రాగా.. గులాబీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగుతుండగా.. ప్రతిపక్షాలు ఏం చేయాలో తేల్చుకోలేక మిన్నకుండి పోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులు ఎవరో తేల్చుకోలేని దుస్థితిలో ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది. ప్రతిపక్ష పార్టీల్లో ఒక్కో సీటుకు పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుండగా.. గులాబీ బాస్ సిట్టింగులకే టికెట్ ఇచ్చి హ్యాట్రిక్‌కు పావులు కదుపుతున్నారు. ఇటీవల నిర్వహించిన రోడ్ షోలు, సభలు దిగ్విజయం కాగా.. ప్రతిపక్షాలు సతమతం అవుతున్నాయి.
– మంచిర్యాల, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో నయాజోష్ కనిపిస్తున్నది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వరుస పర్యటనలతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. మంత్రుల బహిరంగ సభలు, రోడ్ షోలకు భారీగా తరలివచ్చిన జనసందోహం చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కొన్ని చోట్ల ఆ పార్టీలకు అభ్యర్థులు కూడా దొరక్క ముందే బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుండడంతో ఏం చేయాలో తెలియని డైలమాలో ప్రతిపక్ష పార్టీలు, ఆ పార్టీల నాయకులు పడిపోయారు. పార్టీ తమకే టికెట్ ఇస్తుందా? ఇవ్వదా? తెలియక ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ దూకుడు ముందు తాము నిలబడగలుగుతామా అని మరోవైపు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభ్యర్థులు ఎవరో తేల్చుకోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంటే, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బలం లేని బీజీపీ పార్టీ కొట్టుమిట్టాడుతున్నాయి. మరో బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న నాయకులు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి బీఆర్ఎస్కు ఏకపక్షంగా మారింది. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట
చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్లు ఉంది ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు భారీగా దరఖాస్తు చేయడం ఆ పార్టీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో పది నుంచి ఇరవై మంది దరఖాస్తు చేసుకున్నారు. వార్డు మెంబర్లుగా ఓడిపోయిన వారు మొదలు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ ఈ జాబితాలో ఉండడం గమనార్హం. ప్రతి నియోజకవర్గంలో వర్గాలు ఉండడం ఎవరికి వారు మాకే టికెట్ వస్తుందంటే, మాకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటూ వాళ్లలో వారే కొట్టుకుంటున్నారు. ఈ రోజు ఒకరు పర్యటించిన దగ్గరికే మరుసటి రోజు ఇంకొకరు వెళ్తున్నారు. దీంతో ఎవరితో పని చేయాలో తెలియక ఆ పార్టీకి ఉన్న కొద్ది పాటి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ముందు నుంచి కష్టపడిన వారికి ఇప్పుడు టికెట్ వచ్చే పరిస్థితి లేదు. చాలా నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన వారికి, ఉన్నఫలంగా వేరే పార్టీ నుంచి ఊడిపడిన వారికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తుండడంతో ఏళ్లుగా పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్న నేతల్లో అసంతృప్తి పెరుగుతోంది. టికెట్ దక్కని నాయకులు ఆ పార్టీకి సహకరించే పరిస్థితి లేదు. ఖానాపూర్‌లో 15, చెన్నూర్‌లో 14, బెల్లంపల్లిలో 10, ఆదిలాబాద్ 8, బోథ్‌లో 8, మంచిర్యాలలో 7, నిర్మల్, బోథ్, ఆసిఫాబాద్‌లలో నలుగురు చొప్పున, కాగజ్‌నగర్‌లో ముగ్గురు పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీజేపీ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నామమాత్రపు పోటీకే పరిమితం కానుంది. ఈ పార్టీలోనూ ఒక్కో దగ్గర ముగ్గురు నుంచి నలుగురు టికెట్ల కోసం పట్టు బిగుస్తున్నారు. కానీ.. బీజేపీ ఆదిలాబాద్‌లో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదు.
అభివృద్ధి మంత్రం.. హామీ తంత్రం..
జిల్లాలో ప్రధానప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటే.. మరోవైపు గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో బీఆర్ఎ స్ జనంలోకి వెళ్తున్నది. వెళ్లిన ప్రతిచోటా ఇప్పటివరకు చేసిన అభివృద్ధి పనులను నాయకులకు జనాలకు వివరిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా తెలంగాణ రాక ముందు ఎట్లా ఉన్న జిల్లాను తెలంగాణ వచ్చాక ఎలా అభివృద్ధి చేసుకున్నామనే విషయాలను చెప్తున్నారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తున్నారు. ప్రతి నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారా లు చూపిస్తున్నారు. కొత్త మండలాల ఏర్పాటు, చెన్నూర్ రెవె న్యూ డివిజన్ ఏర్పాటు మొదలైన దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేరుస్తూనే, మరోవైపు ప్రస్తుతం ప్రజల్లో ఉన్న డిమాండ్లను నెరవేరుస్తామంటూ హామీలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికి వెళ్లిన జన నీరాజనం పడుతున్నారు. ఇటీవల నిర్మల్, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల్లో ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలు, ర్యాలీలు సక్సెక్ అయ్యాయి. ఇవన్నీ చూస్తున్నా ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రతిపక్షాల సతమతం అవుతున్నాయి.