సోన్, ఏప్రిల్ 12 : ప్రతిపక్ష పార్టీ నాయకుల అబద్ధపు మాటలు నమ్మి బతుకులు ఆగం చేసుకోవద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని దివ్యగార్డెన్‌లో నిర్మల్ రూరల్ మండల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం గురించి కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ప్రజలకు తెలియ జెప్పాలని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు మరమ్మతు, కాలువల ఆధునీకరణ, మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువులను పునరుద్ధరించడం వంటివాటితో రెండు పంటలకు సరిపడా నీరు అందుతోందన్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్రజల బతుకులు బాగు పడ్డాయని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి కనిపించడం లేదని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలిసిందా? పండ్లు, పూలు పెట్టుకున్నారు, పుస్తె కట్టడం మాత్రమే మిగిలి ఉందని గతంలో మహేశ్వర్‌రెడ్డి గురించి తాను చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయన్నారు. ఆయన నేడో, రేపో బీజేపీలో చేరడం ఖాయమని స్పష్టం చేశారు. నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలోనే మహిళలకు గౌరవం పెరిగిందన్నారు. నిర్మల్ మండలంలోని ముజ్గి గ్రామం రాష్ట్రస్థాయిలో అవార్డు రావడంతో సర్పంచ్ పొలాస రాజమణి మల్లేశ్‌లను శాలువాతో మంత్రి సన్మానించారు.
అలాగే మండలంలోని వెంగ్వాపేట్, అక్కాపూర్, తల్వేద గ్రామాల నుంచి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సుమారుగా 200 మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రామ్రెడ్డి, ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నిర్మల్ మండల కన్వీనర్ అల్లోల గోవర్ధన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, వైస్ చైర్మన్ శ్రీకాంత్‌యాదవ్, గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ముఠాపూర్ పీఏసీఎస్ చైర్మన్ బోండ్ల గంగాధర్, వైస్ చైర్మన్ రాజారెడ్డి, మాజీ ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, జడ్పీ కో-అప్షన్ సభ్యులు డాక్టర్ సుభాష్‌రావు, నాయకులు అల్లోల మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, గౌతంరెడ్డి, మహిపాల్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ముత్యంరెడ్డి, సాద విజయ్‌శేఖర్ పాల్గొన్నారు.
ఇంటింటికీ సంక్షేమ పథకాలు..
– కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ, నిర్మల్.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 99 శాతం అభివృద్ధి జరిగిందని, దీంతో ప్రతి ఇంటికీ ఒక్కటైనా సంక్షేమ పథకం అందిందన్నారు. ప్రతిపక్షాల నాయకులు మాటలు చెప్పి వెళ్తారని వారి మాటలు నమ్మవద్దన్నారు. మన కోసం కష్టపడే మన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి మనం ఎల్లప్పుడు అండగా ఉందమన్నారు.
29 రాష్ర్టాల్లో ఎక్కడైనా మన పథకాలున్నాయా..
– పడకంటి రమేశ్‌రెడ్డి, సర్పంచ్, చిట్యాల్.
మనం రాష్ట్రం సాధించుకున్నాక అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, 29 రాష్ర్టాల్లో మన రాష్ట్రంలో ఉన్న పథకాలు ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. నెల రోజుల నుంచి ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయని ప్రతి సమ్మేళనానికి ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరువుతున్నారని దీనికి కారణం మనం చేసుకున్న అభివృద్ధే అన్నారు. మంత్రి అల్లోలను మరోసారి గెలిపించుకుందామని పేర్కొన్నారు.
పట్నం కంటే పల్లెలు సుందరంగా తయారయ్యాయి..
– పొలాస మల్లేశ్, ముజ్గి, నిర్మల్ మండలం.
పట్నం కంటే పల్లెలు సుందరంగా తయారయ్యాయి. అది ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి. ప్రతి గ్రామంలో పరిశుభ్రంగా ఉండేందుకు తడి, పొడి చెత్తను బయట వేయకుండా ఊరికో ట్రాక్టర్‌ను అందించి పట్నం లాగానే పల్లె కూడా సుందరంగా కన్పిస్తున్నాయి. ప్రతి క్లస్టర్‌కు ఏఈవోలను నియమించి, రైతులకు అవగాహన కల్పిస్తూ పంటల దిగుబడులు పెంచుకున్నామన్నారు.